
● కొనేవారు లేక..
బత్తలపల్లి: వర్షాభావం కారణంగా నారు మొక్కలను కొనుగోలు చేయకపోవడంతో వాటిని నర్సరీ యజమానులు దిబ్బల్లో పడేస్తున్నారు. బత్తలపల్లిలో దాదాపు 50 నర్సరీలు ఉన్నాయి. ప్రతి నర్సరీ యజమాని రైతులకు అందుబాటులో ఉండేలా వంగ, టమాట, మిరప, పూల నారు సిద్ధం చేశారు. మొత్తం 50 నర్సరీలలో దాదాపు మూడు కోట్లకు పైగా మొక్కలు సిద్ధంగా ఉంచారు. ట్రేలలో విత్తనం వేస్తే 25 రోజులకు మొక్క సిద్దమవుతుంది. నెల రోజులలోపు వాటిని రైతులు తీసుకెళ్లి పంట పొలాల్లో నాటాల్సి ఉంటుంది. అయితే వర్షాభావంతో పాటు బోరు బావులలో నీరు అడుగంటి పోవడంతో మొక్కలను కొనుగోలు చేసేందుకు రైతులు ముందుకు రావడంలేదు. దీంతో నర్సరీలలో అభివృద్ధి చేసిన మొక్కలు ఎటూ కాకుండా పోయాయి. దీంతో రూ.1.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నర్సరీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.