
జ్వర తీవ్రతను తాళలేక యువకుడి బలవన్మరణం
ఓడీచెరువు(అమడగూరు): జ్వర తీవ్రతను తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. అమడగూరు మండలం శీతిరెడ్డిపల్లికి చెందిన శంకరెడ్డి, ఆదిలక్ష్మమ్మ దంపతుల కుమారుడు మల్లికార్జునరెడ్డి (23) కొంత కాలంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నా ఫలితం లేకపోయింది. బుధవారం జ్వర తీవ్రతను తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని
ఢీకొన్న కారు
తాడిమర్రి: మండల కేంద్రం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దకోట్ల గ్రామానికి చెందిన మంజుల ప్రమీల కుమారుడు నాగరాజు బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తాడిమర్రికి బయలుదేరాడు. మండల కేంద్రం సమీపంలోకి చేరుకోగానే పార్నపల్లికి చెందిన రంగనాయకులు కారులో వెళుతూ మలుపులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనలో నాగరాజుకు కాలు విరిగింది. సమాచారం అందుకున్న బాధితుని కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.