
ఓట్ల చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
మడకశిరూరల్: ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడకశిర మండలం నీలకంఠాపురంలో బుధవారం రాత్రి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్‌వలి, ఏఐసీసీ కార్యదర్శి గణేష్‌యాదవ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల వ్యవస్థ స్వయం పాలన, స్వీయ నిర్ణాయాధికారం కాపాడడానికి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు. దొంగ ఓట్లతో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో మధుగిరి ఎమ్మెల్యే కేఎన్ రాజన్న, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, హిందూపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్ కేటీ శ్రీధర్, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు కోటా సత్యం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
రొళ్ల: మండలంలోని కె.బ్యాడిగెర గ్రామానికి చెందిన లింగప్ప (59) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కెంపమ్మతో పాటు కుమారులు స్థానికంగా లేకపోవడంతో ఆయన ఒంటరిగా నివాసముంటున్నాడు. మూడేళ్ల క్రితం ప్రమాదంలో కాలికి అయిన గాయం నయం కాకపోవడంతో నాలుగు రోజుల క్రితం స్నానపు గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం దుర్వాసన వెదజల్లడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.