
రేషన్‌షాపుగా రైతు సేవా కేంద్రం
రామగిరి: కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సేవ కేంద్రాలు నిర్వీర్యమయ్యాయి. ఇదే అదనుగా ఎవరు పడితే వారు అనధికారికంగా ఆర్‌ఎస్‌కే భవనాలను వాడుకుంటున్నారు. పేరూరులోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గ్రామంలో ఓ చౌకధాన్యపు డిపో డీలర్ ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీని ఏకంగా రైతు భరోసా కేంద్రంలో ప్రారంభించారు. అధికార పార్టీ నాయకుల నోటిమాటగా భవనాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బియ్యం, ఇతర సరుకులు నిల్వ చేసి.. దర్జాగా ప్రభుత్వ భవనాన్ని వాడుకోవడం చూసి ప్రజలు కంగుతిన్నారు. ఈ విషయమై తహసీల్దార్ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇప్పటి వరకూ తన దృష్టికి రాలేదన్నారు. ప్రభుత్వ భవనంలో రేషన్ పంపిణీ చేయరాదన్నారు. ఎవరు అనుమతిచ్చారో తెలుసుకుని.. తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.