
వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసుల పక్షపాతం
ధర్మవరం: తాడిమర్రి మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ శ్రేణుల పట్ల పోలీసులు పక్షపాతం చూపారు. వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల పట్ల ఖాకీలు నిరంకుశంగా ప్రవర్తించారు. తాడిమర్రిలో కురుబ సామాజికవర్గం ఆధ్వర్యంలో జరుగుతున్న ఆర్వేడుపట్నం పెద్దయ్యస్వామి పరుషకు వెళ్లకుండా పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకోవడం వివాదాస్పదమైంది. ఉదయం 10.30 గంటల సమయంలో పరుషకు వెళ్లేందుకు శంకర నారాయణ, గోరంట్ల మాధవ్ తాడిమర్రికి వచ్చారు. ఈ సందర్భంగా వారికి తాడిమర్రి చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు మనోజ్‌రెడ్డి కార్యకర్తలతో కలసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పరుషకు వెళుతుండగా డీఎస్పీ హేమంత్ కుమార్, సీఐ రెడ్డెప్ప సిబ్బందితో కలసి వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్నారు. ఎందుకు వెళ్లకూడదని వారు ప్రశ్నించగా.. ప్రస్తుతం పరుషలో మంత్రి సత్యకుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ ఉన్నారని, ఇప్పుడు మీరు వెళితే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని అన్నారు. తాము ఎవరితోనూ గొడవకు వెళ్లడం లేదని, పరుషలో స్వాములను మొక్కుకుని వస్తామంటూ ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో పోలీసులు, నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఇక్కడి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లాలని పోలీసులు సూచించగా.. తాము పరుషకు వెళతామని, లేదంటే ఇక్కడే ఉంటామని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్‌ను బలవంతంగా ఎత్తుకుని ప్రధాన రహదారి దాటించారు. అలాగే బారికేడ్లతో వారిని నిలువరించడంతో పాటు ఒక ఐచర్ వాహనాన్ని దారికి అడ్డంగా పెట్టారు. చివరకు మంత్రి సత్యకుమార్, పరిటాల శ్రీరామ్ వెళ్లిపోయిన తర్వాత వైఎస్సార్ సీపీ నేతలను పరుషలోకి అనుమతించారు.
పరుషకు వెళ్లకుండా అడ్డుకున్న వైనం
ఆత్మాభిమానం, ఆత్మగౌరవంపై
దాడి చేశారన్న గోరంట్ల మాధవ్
మా కురుబల అరాధ్యదైవాన్ని చూడటానికి వెళ్లడం కూడా తప్పేనా అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోలీసులను ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నేతల పట్ల పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల చర్యలు బడుగు, బలహీన వర్గాల వారి ఆత్మాభిమానం, ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టేలా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మా
కులదైవాన్ని
చూడటానికి
వెళ్లడం కూడా
తప్పా?