
బాలకృష్ణను పిచ్చాస్పత్రిలో చేర్చాలి
మడకశిర: ‘‘తనకు మెంటల్ ఉందని గతంలోనే బాలకృష్ణ వైద్యులతో ధ్రువీకరణ పత్రం తెచ్చుకున్నారు. అయితే ఆయన మానసిక స్థితి బాగుపడిందనుకున్నాం. కానీ గురువారం అసెంబ్లీలో ఆయన చేష్టలు చూస్తే పిచ్చి ముదిరినట్లు తెలుస్తోంది, వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలి’’ అని వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన తీరును చూసి తెలుగు ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు.
చిరంజీవిపై, మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ముఖ్యంగా హిందూపురం నియోజకవర్గం ప్రజలు మరింత బాధపడుతున్నారన్నారు. ఇలాంటి వ్యక్తికా..తాము ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించిందని మదనపడుతున్నారన్నారు. ఇక నిండుసభలో చిరంజీవిని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దూషించినా పవన్‌కళ్యాణ్ మిన్నకుండిపోవడం చూస్తే పదవుల కోసం అతను ఎంతలా దిగజారారో అర్థం అవుతోందన్నారు. ఇక తన స్థాయి మరచి జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అసెంబ్లీలో బాలకృష్ణ తూలనాడటం దిగజారిన రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటనే వైఎస్ జగన్‌కు క్షమాపణ చెప్పాలని ఈరలక్కప్ప డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌ను మరోసారి దూషిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
పవన్ నైజంబయటపడింది
కదిరి టౌన్ : సొంత అన్నను అవమానించిన వారిని ఒక్కమాట మాట్లాడని పవన్‌కళ్యాణ్ నైజమేమిటో ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతోందని వైఎస్సార్ సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిండుసభలో ఎమ్మెల్యే బాలకృష్ణ తన అన్న చిరంజీవిని దూషించినా పవన్ కనీసం స్పందించకపోవడం ఆయన దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. అందుకే ఎక్కడో ఉన్న చిరంజీవే ఓ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. కూటమి భాగస్వామి అయిన పవన్‌కళ్యాణ్ కనీసం తన ఉనికినైనా కాపాడుకోవాలన్నారు.
ఇక మద్యం మత్తులో అసెంబ్లీకి వెళ్లి ఎలా పడితే అలా మాట్లాడుతున్న బాలకృష్ణ మరోసారి ఇలాగే వ్యవహరిస్తే తాటతీస్తామని మక్బూల్ హెచ్చరించారు. ‘మెంటల్ బాలకృష్ణా...నోరు అదుపులో పెట్టుకో..లేకపోతే ఇబ్బందులు పడతావ్’’ అన్నారు. అసెంబ్లీలో దిగజారి మాట్లాడిన బాలకృష్ణను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి 15 నెలలైనా హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం.. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. అందులో భాగంగానే బాలకృష్ణతో మాట్లాడించారన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

బాలకృష్ణను పిచ్చాస్పత్రిలో చేర్చాలి