
కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర
గాండ్లపెంట: వేళాపాలా లేని కరెంటు కోతలపై జనం కన్నెర్ర చేశారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గాండ్లపెంట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని వేపలకుంట ఫీడర్‌లో నిత్యం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. దీంతో రాత్రి వేళల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వ్యవసాయ బోర్లు కూడా ఆడకపోవడంతో రైతులు పంటలు కోల్పోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సోమయాజులపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు మండల కేంద్రానికి తరచ్చారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట కదిరి–రాయచోటి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... ఆరు నెలలుగా లైన్‌మెన్ లేకపోవడంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. విద్యుత్ సరఫరా నిలిచినా ఎవరికి చెప్పాలో తెలియడం లేదన్నారు. తనకల్లు ఏఈ మండల ఇన్‌చార్జ్ ఏఈగా ఉన్నారని, ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియడం లేదన్నారు. మండలానికి ఏఈని, తమ గ్రామానికి లైన్‌మెన్‌ను నియమించాలని డిమాండు చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా, ఎల్‌ఐ ప్రసాద్ అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. విషయాన్ని విద్యుత్ శాఖ ఏడీ వరప్రసాద్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, రెండు రోజుల్లోపు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట
రాస్తారోకో