దారి తప్పిన దర్యాప్తు! | - | Sakshi
Sakshi News home page

దారి తప్పిన దర్యాప్తు!

Sep 27 2025 6:49 AM | Updated on Sep 27 2025 6:49 AM

దారి తప్పిన దర్యాప్తు!

దారి తప్పిన దర్యాప్తు!

సాక్షి, పుట్టపర్తి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన హిందూపురంలోని ఎస్‌బీఐ దోపిడీ కేసులో రీకవరీ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. హిందూపురం పట్టణ శివారున తూమకుంట ప్రాంతంలో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) లో గత జూలై 27వ తేదీ రాత్రి భారీ చోరీ జరిగింది. నిందితుడు పక్కా ప్లాన్‌తో బ్యాంకులోకి చొరబడి సుమారు రూ.12 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లాడు. లొకేషన్‌ దొరక్కుండా... శాటిలైట్‌ ఫోన్‌ వాడి.. బ్యాంకులోకి చొరబడ్డాడు. అయితే కేవలం రెండు సెకన్ల సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు హరియాణకు చెందిన మాజీ ఆర్మీ అధికారి అనిల్‌ కుమార్‌ పన్వార్‌గా గుర్తించి ఈనెల 6వ తేదీన అరెస్టు చేశారు.

దొంగ కథ.. పోలీసుల వంత..

ఎస్‌బీఐ దోపడీ కేసులో నిందితుడైన అనిల్‌ కుమార్‌ పన్వార్‌ను పట్టుకున్న పోలీసులు.. అతని నుంచి కేవలం రూ.2 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే రీకవరీ చూపించారు. మిగతా బంగారం ఎక్కడ ఉందనే విషయంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. తనతో పాటు మరో నిందితుడు ఉన్నాడని.. అతడి వద్ద మిగతా బంగారం ఉందని అనిల్‌ కుమార్‌ పన్వార్‌ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఆ నిందితుడు ఎవరు.. ఎక్కడ ఉన్నాడనే దానిపై స్పష్టత లేదు. అనిల్‌ కుమార్‌ పన్వార్‌ చెబుతున్న మాటలను పోలీసులు ఎందుకు నమ్ముతున్నారు? అసలు ఏం జరుగుతోంది? అనేది తెలియాల్సి ఉంది.

దొంగ ట్రాప్‌లో పోలీసులు..

అనిల్‌ కుమార్‌ పన్వార్‌ చెప్పిన వివరాల మేరకు తూమకుంట బ్యాంకు దోపిడీ కేసులో ఇద్దరు పాల్గొన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు. అయితే ఆ మరో వ్యక్తి ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు. కానీ మరో నిందితుడో ఇంకో కేసులో రాజస్తాన్‌లో జైలు జీవితం అనుభవిస్తున్నట్లు సమాచారం. తూమకుంట బ్యాంకు దోపిడీలో మిగతా సొమ్ము అతడి వద్దనే ఉన్నట్లు అనిల్‌ కుమార్‌ పన్వార్‌ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. నిజంగా అతడి వద్దనే బంగారం ఉందా? లేక పోలీసులు దొంగ అల్లిన కట్టుకథ ట్రాప్‌లో పడ్డారా అన్నది తెలియడం లేదు. ఎందుకంటే అనిల్‌ కుమార్‌ పన్వార్‌ చేసిన చోరీలన్నీ విభిన్నమైనవే. ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో దోపిడీ చేశాడు. కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌ అవుతూ టెక్నాలజీ ఉపయోగించి దోపిడీలకు పాల్పడటం అతని స్టైల్‌. అలాంటి వ్యక్తి మాటలు నమ్మి పోలీసులు మరో నిందితుడి కోసం ఆరా తీస్తుండటం చర్చనీయాంశమైంది.

వ్యసనంతో పతనమై..

బ్యాంకు చోరీ కేసులో పట్టుబడిన నిందితుడు అనిల్‌ కుమార్‌ పన్వార్‌ వ్యసనాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2007లో ఆర్మీ నుంచి తిరిగొచ్చిన అతను.. జూదంలో భారీ మొత్తం కోల్పోయాడు. అనంతరం బ్యాంకులకు కన్నం వేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా పదే పదే బ్యాంకుల్లో దోపిడీ చేస్తూ సుమారు 8 ఏళ్లు పైగా జైలు జీవితం అనుభవించాడు. చోరీ చేయడం.. జైలుకు వెళ్లడం.. బయటికి రావడం.. మళ్లీ దొంగతనం చేయడం.. ఇదే జీవనశైలిగా మార్చుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 14 బ్యాంకుల్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్‌లో జైలు నుంచి బయటికి వచ్చిన అతను... జూలైలో తూమకుంట ఎస్‌బీఐకి కన్నం వేశాడు. ప్రస్తుతం అరెస్టయి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. పదే పదే చోరీలు చేస్తూ కటకటాల పాలవుతున్న అతన్ని పరామర్శించేందుకు కుటుంబ సభ్యులు కూడా రావడం లేదు. ఇటీవల తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా విషెస్‌ చెబుతూ ‘ఇక నుంచి దొంగతనాలు మానేస్తా’ అని మాట ఇచ్చినట్లు తెలిసింది.

ఎస్‌బీఐ దోపిడీ కేసు దర్యాప్తులో

పోలీసుల అలసత్వం

రూ.12 కోట్ల చోరీలో..

రూ.2 కోట్లు మాత్రమే రికవరీ

ఇప్పటికే పట్టుబడిన అనిల్‌ కుమార్‌ కట్టుకథను నమ్ముతున్న పోలీసులు

మరో నిందితుడి వద్దే

బంగారం ఉందని భావిస్తున్న వైనం

మరి ఎవరా దొంగ..

ఎక్కడా బంగారు.. ప్రశ్నిస్తున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement