
లగోరికి పూర్వవైభవం
సాంప్రదాయ ఆటకు గుర్తింపు
లగోరి ఆటకు రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యత పెరుగుతోంది. తాజాగా కొన్ని రాష్ట్రాలలో లగోరి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా ఈ సాంప్రదాయ ఆటకు గుర్తింపు వస్తోంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఆట ద్వారా మన ఆలోచన విధానం, వేగం పెరుగుతాయి.
– జాహ్నవి, హిందూపురం
హిందూపురం టౌన్: అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలు ఒక్కొక్కటిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే దేశాన్ని కబడ్డీ ఓ ఊపు ఊపేస్తుండగా... తాజాగా లగోరి క్రీడ ఆ జాబితాలోకి చేరుతోంది. దేశ సంస్కృతిలో ఓ భాగమైన లగోరి క్రీడకు చాలా ప్రాముఖ్యత ఉంది. దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు తన స్నేహితులతో కలసి చిన్నప్పుడు ఈ ఆటను ఆడినట్లుగా పురాణ ఇతిహాసం భాగవతం వెల్లడిస్తోంది. వివిధ ప్రాంతాల్లో లగోరి ఆటను పిట్టు గరం, 7 రాళ్లు, 7 పెంకులాట, సత్తాడు వంటి చాలా పేర్లతో పిలుస్తుంటారు. హిందూపురం ప్రాంతంలో ఈ ఆట విశేష ప్రాచూర్యం పొందింది. ఇక్కడి విద్యార్థులు లగోరి ఆటలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్నారు.
ఆట నియమాలు..
● ఆటలో పాల్గొనడానికి రెండు జట్లు ఉంటాయి. ప్రతి జట్టులో కనీసం 15 మంది ఆటగాళ్లు ఉంటారు. ఆరుగురు లోపల, ఆరుగురు బయట, ముగ్గురు బెంచ్‌లో ఉంటారు. మొత్తం 12 మంది ఆటలో పాల్గొంటారు.
● ఆటలో ఏడు పెంకులు (లేదా ఫైబర్ డిస్కులు), ఒక బంతి ఉంటాయి.
● ఒక జట్టులోని ఆటగాడు బంతితో పెంకుల కుప్పపైకి విసిరి, వాటిని పడగొడతాడు.
● పెంకులు పడగొట్టిన జట్టు క్రీడాకారులు తమను తాము ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు బంతితో కొట్టకుండా తప్పించుకుంటూ, ఆ పెంకులను తిరిగి పేర్చడానికి ప్రయత్నించాలి.
● ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు బంతితో కొడితే, వారు ఆట నుండి తొలగించబడతారు.
● పెంకులను విజయవంతంగా పేర్చిన జట్టు గెలుస్తుంది, లేదా ప్రత్యర్థి జట్టులోని మిగిలిన ఆటగాళ్లందరినీ తొలగించిన జట్టుకు విజయం వరిస్తుంది.
ప్రాచుర్యంలోకి వస్తున్న లగోరి ఆట..
హిందూపురం ప్రాంతంలో చాలా కాలంగా లగోరి ప్రాచుర్యంలో ఉంది. చాలా మంది విద్యార్థులు పాఠశాల విరామ సమయంలో వినోదం కోసం ఈ ఆటను ఆడుతుంటారు. సెలవు రోజుల్లో కాలనీల్లో లగోరి క్రీడ సర్వసాధారణమై పోయింది. ఈ క్రమంలో లగోరిపై హిందూపురం ప్రాంత విద్యార్థులు పూర్తి స్థాయి పట్టు సాధించగలిగారు. గత నెల ఆగష్టు 7న జిల్లా లగోరి అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూపురంలోని చిన్మయ విద్యాలయంలో 1వ జిల్లా స్థాయి లగోరి చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విశేష ప్రతిభ కనపరిచిన హిందూపురం విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయిలో పోటీలకు అర్హత సాధించారు. ఆగస్టు 17న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల లగోరి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన హిందూపురంతో పాటు మడకశిర, పెనుకొండ ప్రాంతానికి చెందిన విద్యార్ధినులు తమ ప్రతిభతో జిల్లా జట్టును విజేతగా నిలిపారు.
లగోరి క్రీడపై పెరుగుతున్న ఆసక్తి
రాష్ట్ర స్థాయిలో సత్తాచాటుతున్న
‘పురం’ విద్యార్థులు
జిల్లాకు మంచి పేరు తెస్తా
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతాం
లగోరి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఈ ఆటను ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. లగోరి ఆటకు ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జిల్లాకు మంచి పేరు తెస్తా.
– మోక్షిత, హిందూపురం
రాష్ట్ర స్థాయిలో లగోరి ఆటను ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో లగోరి అసోసియేషన్‌లు ఏర్పాటయ్యాయి. మేము రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాం. జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటాలని ఉంది.
– లిఖిత, హిందూపురం

లగోరికి పూర్వవైభవం

లగోరికి పూర్వవైభవం

లగోరికి పూర్వవైభవం

లగోరికి పూర్వవైభవం