
జూదరుల అరెస్ట్
బత్తలపల్లి: మండలంలోని రామాపురం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, రూ.8,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు బత్తలపల్లి పీఎస్ ఎస్‌ఐ సోమశేఖర్ తెలిపారు. అందిన సమాచారం మేరకు గురువారం ఆ గ్రామ సమీపంలోని చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో నది ఒడ్డున పేకాట ఆడుతూ జూదరులు పట్టుబడ్డారన్నారు.
● హిందూపురం: మండలంలోని మనేసముద్రం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, రూ.15,080 నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హిందూపురం రూరల్ పీఎస్ సీఐ ఆంజినేయులు తెలిపారు. అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి జూదరులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
డీఎస్సీ అభ్యర్థి ఆత్మహత్య
పరిగి: డీఎస్సీ – 2025లో ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామానికి చెందిన వెంకటేశ్(37)కు భార్య లీలావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బీపీఎడ్ పూర్తి చేసి, ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల డీఎస్సీ పరీక్షకూ హాజరయ్యాడు. అయితే ఎంపిక జాబితాలో పేరు లేకపోవడంతో జీవితంపై విరక్తితో గురువారం ఉదయం స్థానిక ఓ ప్రైవేట్ కళాశాల వెనుక ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో మృతుడి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
వేధింపుల కేసు నమోదు
ధర్మవరం అర్బన్: వివాహిత ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్త, మామపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. ధర్మవరంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన సయ్యద్ షాహీనా, బాబా ఫకృద్ధీన్ దంపతులు. ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాబా ఫకృద్ధీన్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని షాహీనాను వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. విషయాన్ని అత్త షంషాద్, మామ మదార్ వలి దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైతం బాబా ఫకృద్దీన్‌కే వత్తాసు పలుకుతూ షాహీనాను శారీరకంగా, మానసికంగా హింసలకు గురి చేశారు. దీంతో బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బండరాళ్లు మీదపడి యువకుడి మృతి
తనకల్లు: స్థానిక భారత్ పెట్రోల్ బంకు సమీపంలోని నల్లగుట్టలో గురువారం బండరాళ్లు మీదపడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లులోని సంజీవయ్య నగర్‌కు చెందిన ఇండ్ల చంద్ర (32)కు భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో స్థానిక సర్వే నంబర్ 793లో ఇంటి పట్టా ఇప్పిస్తామని సీపీఎం, రైతు సంఘం నాయకులు శివన్న, రమణ, ఒంటెద్దు వేమన్న, వెంకటరమణ చెప్పడంతో అక్కడ స్థలాన్ని చూసేందుకు గురువారం ఇండ్ల చంద్ర నల్లగుట్ట వద్దకు వెళ్లాడు. అదే సమయంలో గుట్టలో కొందరు జేసీబీ సాయంతో రాళ్లను తొలగించి భూమిని చదును చేస్తుండడంతో చంద్ర కూడా అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో గుట్టపై ఉన్న రాళ్లు కదలి ఒక్కసారిగా మీద పడడంతో చంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, రూరల్ పీఎస్ సీఐ నాగేంద్ర, స్థానిక ఎస్‌ఐ గోపి అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సాయంతో బండ రాళ్లను తొలగించి మృతదేహాన్ని వెలికి తీయించారు. భార్య కావ్య చేసిన ఫిర్యాదు మేరకు జేసీబీ డ్రైవర్ షెక్షావలి, సీపీఎం, రైతు సంఘం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైల్వేలో క్యూఆర్ కోడ్‌తో
జనరల్ టిక్కెట్ల విక్రయాలు
గుంతకల్లు: దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా రైల్వేలో జనరల్ టిక్కెట్లు (ఆన్ రిజర్వ్) కొనుగోలును మరింత సులభతరం చేయడానికి క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సీనియర్ డీసీఎం మనోజ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో రెట్రో రిఫ్లెక్టివ్ జాకెట్లపై క్యూర్ కోడ్‌ను ముద్రించారు. ఈ జాకెట్లను సంబంధిత విభాగపు సిబ్బంది ధరించేలా చేశారు. జాకెట్ వెనుక భాగంలో ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేసి టిక్కెట్‌ను పొందే వెసులుబాటు కల్పించారు. ఆన్‌రిజ్వర్డ్, ఫ్లాట్‌ఫారం టిక్కెట్లు కొనుగోలు చేసే సమయంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలను తెలుసుకునేలా సిబ్బంది సహకరిస్తారు. అంతేకాక టిక్కెట్ కొనుగోలు చేసినప్పుడు 3 శాతం బోనస్ క్రెడిట్ అవుతుంది. ప్రసుత్తం డివిజన్‌లో ఎక్కవగా రద్దీ ఉండే తిరుపతి, గుంతకల్లు రైల్వే జంక్షన్లలో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు.

జూదరుల అరెస్ట్

జూదరుల అరెస్ట్