
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం
పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య హెచ్చరించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు పరిశీలించారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేమయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చిందని, వీటిలో కొన్ని కాలేజీల నిర్మాణం పూర్తయి తరగతులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరి కొన్ని 70 శాతం నిర్మాణాలు పూర్తి అయినట్లు తెలిపారు. వీటిని పీపీపీ పద్ధతిలో నిర్వహించేలా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయం సరైంది కాదన్నారు. నాబార్డు నిధులతో పనులు ప్రారంభించిన పెనుకొండ మెడికల్ కళాశాలకు ఇప్పటికే రూ.30 కోట్లు ఖర్చయ్యాయని, 50 శాతానికి పైగా పనులు పూర్తికాగా, మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర అణగారిన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే దిశగా కూటమి సర్కారు అడుగులేస్తోందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాల ఉంటే అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయన్నారు. అదే ప్రైవేటీకరణ చేయడం ద్వారా జ్వరానికి చికిత్స పొందాలన్నా డబ్బు చెల్లించక తప్పదన్నారు. ఫీజులు సైతం యాజమాన్యాలు ఇష్టానుసారంగా వసూలు చేస్తాయని మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, కాదని ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జయరాజు, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు, నాయకులు బాలస్వామి, మల్లికార్జున, నరసింహులు, రమేష్, కిష్టప్ప, విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య