
హక్కుల సాధనకు పోరాడాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి సమైక్యంగా ఉద్యమించాలని ఆశావర్కర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అనుసరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. గురువారం స్థానిక గణేనాయక్ భవన్‌లో ఆశావర్కర్ల సంఘం జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు ధనలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హక్కుల సాధనకు ఐక్య పోరాటాలు చేపట్టాలన్నారు. ఆశావర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలన్నారు. మెడికల్, కాజ్యువల్ లీవులు వర్తింపజేయాలన్నారు. అంతిమసంస్కారాల ఖర్చులకు రూ.20 వేలు ఇవ్వాలన్నారు. జనాభాకు అనుగుణంగా ఆశా కార్మికుల నియామకాలు చేపట్టాలన్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మద్ధతునిస్తూ ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేస్తూ తొలగిస్తోందని మండిపడ్డారు. అదే కార్పొరేట్ సంస్థలకు మాత్రం ఒక్క రూపాయికి ఎకరా చొప్పున వందల ఎకరాలను అప్పగిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, ఉపాధ్యక్షుడు రామాంజినేయులు, ఆశావర్కర్ల సంఘం నాయకురాళ్లు కుళ్లాయమ్మ, రాధమ్మ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.