
నేటి నుంచి పోషణ్ మాసోత్సవాలు
పుట్టపర్తి అర్బన్: ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకూ జిల్లాలో పోషణ్ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ ప్రమీల తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన ఆహారాలు, పర్యావరణం, సమానత్వం, సాధికారత, స్థూలకాయ నివారణ తదితర ఐదు అంశాలపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధ్యాయులపై
పని భారం తగ్గించండి
● స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు
మడకశిర: ఉపాధ్యాయులపై పని భారం తగ్గించి, బోధనకే పరిమితం చేయాలంటూ ప్రభుత్వాన్ని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఏపీ ఏస్టీఏ జిల్లా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డితో కలసి బేగార్లపల్లి, కదిరేపల్లి, పాపసానిపల్లి, సిద్ధగిరి, గుండుమల, మడకశిర పాఠశాలల్లో మంగళవారం ఆయన సభ్యత్వ నమోదు నిర్వహించారు. అనంతరం మడకశిర మండలం వనరుల కేంద్రంలో జిల్లా సబ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. యాప్‌ల భారంతో పాటు అసెస్మెంట్ పుస్తకాల నిర్వహణతో పాఠ్యాంశాల బోధనకు సమయం సరిపోవడం లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రాట్యూటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌క్యాష్మెంట్ తదితర బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నాలుగు పెండింగ్ డీఏలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎస్టీఏ జిల్లా కోశాధికారి ప్రదీప్‌కుమార్, డివిజన్ నాయకులు రమేష్, సురేష్, నాగరాజాచారి, మంజునాథ్, ఉమేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.