
ఆ తల్లి నిర్ణయం.. ఆరుగురికి వరం
● ఒక్కగానొక్క కుమారుడి బ్రెయిన్‌డెడ్
● అవయవ దానానికి తల్లి అంగీకారం
చిలమత్తూరు: ఒక్కగానొక్క కుమారుడు. బిడ్డకు మూడు నెలల వయసులోనే భర్త మరణించాడు. అయినా కష్టాలకు ఎదురీది కుమారుణ్ని కంటికి రెప్పలా చూసుకుంది. ఇరవై ఏళ్లు నిండాయి. ఇంటికి పెద్దదిక్కుగా నిలుస్తాడనుకుంది. అయితే విధి మరొకటి తలచింది. కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఈ బాధ ఆ తల్లి గుండెను పిండేసింది. ఇంతటి దుఃఖంలోనూ కుమారుడి అవయవదానానికి అంగీకరించింది. వివరాల్లోకి వెళితే... చిలమత్తూరులో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, తుమ్మలకుంటకు చెందిన నవీన్‌తో పాటు మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. నవీన్‌ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. ఆసుపత్రి వర్గాలు నవీన్ తల్లి గీతతో మాట్లాడి కుమారుడి అవయవాలు దానం చేయాలని అభ్యర్థించారు. ఇందుకు ఆమె అంగీకరించింది. తన బిడ్డ భౌతికంగా దూరమైనా అవయవ దానంతో సజీవంగా ఉంటాడని భావించింది. గుండె, కళ్లు, లివర్, కిడ్నీలను దానం చేసింది. వాటిని వైద్యులు ఆరుగురికి అమర్చి పునర్జన్మ ప్రసాదించారు. ఈ విషయం తెలిసిన పలువురు గీతను ప్రశంసిస్తున్నారు.
సమ్మె చేయండని
ఏ గొట్టంగాడు చెప్పాడు!
● ఎంపీడీఓ రమణమూర్తి
వివాదాస్పద వ్యాఖ్యలు
చిలమత్తూరు: సమ్మె నోటీసు ఇచ్చేందుకు వెళ్లిన సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ రమణమూర్తి నోరు పారేసుకున్నారు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయండని ఏ గొట్టం గాడు చెప్పాడు’ అంటూ సచివాలయ ఉద్యోగులపై ఆయన రెచ్చిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘సమ్మె గిమ్మె అంటూ తిరిగితే షోకాజ్ నోటీసులు ఇస్తాను జాగ్రత్త’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమైన సచివాలయ ఉద్యోగులపై ఎంపీడీఓ చేసిన వ్యాఖ్యలను గ్రామ/వార్డు సచివాలయాల దివ్యాంగ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశ్వర్థ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు సమ్మె హక్కును రాజ్యాంగం ప్రసాదించిందన్నారు. దాన్ని కూడా కాలరాయడం తగదన్నారు. వలంటీర్లు చేయాల్సిన పనులను సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ సీఎం చంద్రబాబు సచివాలయ ఉద్యోగులపై కక్ష తీర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కించపరిచేలా మాట్లాడిన ఎంపీడీఓ రమణమూర్తి వెంటనే సచివాలయ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.