బోధిస్తాం..వేధింపులు పడలేం | - | Sakshi
Sakshi News home page

బోధిస్తాం..వేధింపులు పడలేం

Sep 15 2025 7:53 AM | Updated on Sep 15 2025 7:53 AM

బోధిస్తాం..వేధింపులు పడలేం

బోధిస్తాం..వేధింపులు పడలేం

కదిరి: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదోన్నతి(ప్రమోషన్‌) కోరుకుంటాడు. ఇందుకోసం ఎంతో కష్టపడతాడు. పదోన్నతి దక్కగానే సంతోషపడిపోతాడు. జీవితంలో మరో మెట్టు ఎక్కానని గర్వపడతాడు. మిగతా శాఖలతో పోలిస్తే విద్యాశాఖలో ప్రమోషన్‌ కోసం దశాబ్దాలుగా ఎదురుచూడాల్సి ఉంటుంది. అందుకే ప్రమోషన్‌ జాబితాలో పేరు కనిపించగానే టీచర్లు సంబరపడతారు. కానీ రాష్ట్రంలో కూటమి సర్కార్‌ కొలువుదీరాక పరిస్థితి మారిపోయింది. ప్రమోషన్‌ అంటేనే ప్రస్తుతం టీచర్లు భయపడిపోతున్నారు. ఇటీవల స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)గా ఉన్న కొందరికి ఉన్నత పాఠశాల హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పిస్తే అందులో సగం మంది దాకా ‘మాకొద్దు..బాబు నీ ప్రమోషన్‌’ అంటూ తిరస్కరించారు. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వం వారిని ఎంత ఒత్తిడికి గురి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

124 మందిలో 52 మంది విముఖత

గత జూన్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 124 మంది స్కూల్‌ అసిస్టెంట్లకు కూటమి ప్రభుత్వం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించింది. అయితే వారిలో 52 మంది టీచర్లు పదోన్నతులు తీసుకునేందుకు ఇష్టపడలేదు. కొందరైతే హెచ్‌ఎంలుగా బాధ్యతలు తీసుకొని రెండు, మూడు నెలలు పని చేసి తర్వాత ‘హెచ్‌ఎం పోస్టుకు ఓ దండం’ అంటూ మళ్లీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు వెనక్కు వచ్చేశారు. ఇలా స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి రొళ్ల మండలంలోని ఓ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పదోన్నతి పొందిన ఒకరు రెండున్నర నెలలు హెచ్‌ఎంగా పని చేసి తర్వాత రివర్షన్‌ తీసుకుని కదిరి ప్రాంతానికి స్కూల్‌ అసిస్టెంట్‌గా వచ్చారు. ఇటీవలే ప్రమోషన్‌ పొంది సోమందేపల్లి సమీపంలోని ఓ పాఠశాలలో హెచ్‌ఎంగా ఉన్న ఒకరు ‘నాకు హెచ్‌ఎం ప్రమోషన్‌ వద్దు. రివర్షన్‌ ఇచ్చి నన్ను మళ్లీ స్కూల్‌ అసిస్టెంట్‌గా పంపండి సార్‌ ప్లీజ్‌..’ అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.

గౌరవం కాదు..భారం

ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడంటే అందరికీ గౌరవమే. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులందరూ హెచ్‌ఎంకు తగిన గౌరవం, మర్యాద ఇస్తారు. అందుకే గతంలో ప్రధానోపాధ్యాయుడిగా ప్రమోషన్‌ తీసుకునేందుకు ఉత్సాహం చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. ప్రమోషన్‌ అంటేనే టీచర్లు భయపడి పోతున్నారు. ‘కూటమి ప్రభుత్వం విద్యార్థుల చదువుకు సంబంధించినవి కాకుండా రోజూ అనవసరమైన నివేదికలు కోరుతోంది. అది కూడా సమాచారం అడిగిన గంటలోనే పంపాలని ఒత్తిడి పెడుతోంది... అందుకే చాలా మంది హెచ్‌ఎం పోస్టు మాకు వద్దని తప్పుకుంటున్నారు..’ అని జిల్లాలోని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం పెట్టే ఒత్తిడిని భరించలేని ఎందరో ప్రధానోపాధ్యాయులు బీపీ, షుగర్‌, గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

హెచ్‌ఎం పోస్టు మాకొద్దు బాబూ

కూటమి సర్కారులో ప్రధానోపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి

అడిగిన వెంటనే నివేదికలివ్వాలంటూ ఆదేశాలు

బోధనేతర పనులతో ఉక్కిరి బిక్కిరి

మానసిక ఒత్తిడితో రోగాల బారిన పడుతున్న వైనం

‘టెన్షన్‌’ పడలేక పదోన్నతులను తిరస్కరిస్తున్న ఉపాధ్యాయులు

‘పాఠాలు చెబుతాం. పాఠశాల నిర్వహణ మాత్రం చూడలేం’ జిల్లాలోని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఎందుకంటే కూటమి సర్కార్‌ కొలువుదీరాక ప్రధానోపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి పెరిగింది. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, తరగతి గదుల మరమ్మతులు, తల్లిదండ్రుల కమిటీలతో సమన్వయం.. ఇలా ఇతర కార్యక్రమాల నివేదికలు క్షణాల్లో కావాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. దీంతో చాలా మంది హెచ్‌ఎం బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement