
సర్వజనాస్పత్రిలో ఆహారం.. ఘోరం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. జీజీహెచ్‌లో డైట్ తయారు చేసే గది బూత్ బంగ్లాను తలపిస్తోంది. దీనిపై గతంలోనే ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమైనా పరిస్థితిలో మార్పురాలేదు. సర్వజనాస్పత్రిలో రోజూ 2,500 మంది ఓపీ, 1,100 మంది ఇన్‌పేషంట్లు ఉంటారు. ఇన్‌పేషంట్లలో గైనిక్, లేబర్ వార్డులో జేఎస్‌ఎస్‌కే మెనూ ప్రకారం, మధుమేహం ఉన్న వారికి మరో రకమైన ఆహారం ఇవ్వాలి. కానీ నూతన కాంట్రాక్టర్ అలాంటి చర్యలు తీసుకోలేదు. ఆదివారం ఉదయం నాణ్యత లేని ఉప్మా, నీళ్ల చట్నీ, పాలు అందించారు. ఇడ్లీ, పొంగల్ ఇస్తారు కదా అని డైట్ అందించేవారిని అడిగితే ఇంట్లోలాగా ఇక్కడ భోజనం పెట్టరు.. ఏమి ఇస్తే అదే తీసుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. గైనిక్, లేబర్ వార్డులోని గర్భిణులు, బాలింతలకు కిచిడీ, చట్నీ ఇవ్వాల్సి ఉండగా, ఉప్మాతోనే సరిపెట్టారు. అలాగే మధ్యాహ్నం రాత్రి వేళల్లోనూ మెనూ పాటించలేదని తెల్సింది.
శుభ్రత పాటించని డైట్ సిబ్బంది..
డైట్ సరఫరా చేసే సిబ్బంది శుభ్రత పాటించడం లేదు. చెప్పులు వేసుకొని ఆహారం తీసుకెళ్లే ట్రాలీని తోసుకెళ్తున్నారు. దీంతో పాటు చేతులకు గ్లౌజు, ముఖానికి మాస్క్, తలకు క్యాప్ లేకుండానే ఆహారం సరఫరా చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎల్ సుబ్రమణ్యం పట్టించు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే పరిస్థితులు మెరుగుపడతాయని రోగులు అంటున్నారు.

సర్వజనాస్పత్రిలో ఆహారం.. ఘోరం