
శాంతిభద్రతలు, మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి
పుట్టపర్తి టౌన్: శాంతిభద్రతలు, మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని నూతన ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు ఆయన బదిలీపై వచ్చారు. ఆదివారం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. బ్రాస్‌బ్యాండ్ నడుమ చాంబర్ వద్దకు చేరుకోగా.. పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఎస్పీ రత్న నుంచి సతీష్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని ప్రతి విభాగాన్నీ పరిశీలించారు. అక్కడి నుంచి బయల్దేరి దుర్గమ్మ ఆలయం చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అటు నుంచి మసీదు, చర్చిలకు వెళ్లి ఆయా మత పెద్దలతో కలసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ప్రశాంతి నిలయం వెళ్లి భగవాన్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
నేరాల నియంత్రణకు కృషి
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌నూ సందర్శించి, అక్కడి కేసుల వివరాలు తెలుసుకుని నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఎస్పీ సతీష్‌కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతానని, ప్రజలు కూడా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను విస్తృతం చేస్తామన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.
నూతన ఎస్పీకి శుభాకాంక్షలు
నూతనంగా ఎస్పీ సతీష్‌కుమార్‌ను డీఎస్పీలు విజయకుమార్, నరసింగప్ప, హేమంత్‌కుమార్, శివన్నారాయణస్వామి, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఏఓ సుజాత, సూపరింటెండెంట్ సరస్వతి, మల్లికార్జున, ఎస్పీ సీసీ చిరంజీవి, ఆర్‌ఐ మహేష్‌తోపాటు సీఐలు, ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నూతన ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడి