
బార్.. టెం‘డర్’
సాక్షి, పుట్టపర్తి
నూతన మద్యం పాలసీతో ఆదాయం పెంచుకోవాలనే ప్రభుత్వ ఆలోచనకు అధికార కూటమి పార్టీల నాయకులు తూట్లు పొడుస్తున్నారు. మద్యం దుకాణాలన్నీ తమ ఆధ్వర్యంలోనే నడిపిస్తూ సొమ్ము చేసుకుంటున్న నేతలు...తాజాగా బార్లపై కన్నేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలవగా.. కూటమి పార్టీల నాయకులే సిండికేటుగా మారి ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లాలో 12 బార్లకు టెండర్లు పిలవగా.. ఏడింటికి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వాటిని లాటరీ పద్ధతిన కేటాయించారు. మిగిలిన ఐదు బార్లకు మరోమారు నోటిఫికేషన్ జారీ చేశారు. వాస్తవానికి ఆదివారంతో (ఈనెల 14) దరఖాస్తుకు గడువు ముగుస్తుంది. అయినా దరఖాస్తులు రాలేదు. దీంతో ఎకై ్సజ్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల గడువు ఈనెల 17వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. అయితే ఇప్పటివరకు ఒక్క బార్‌కు కూడా దరఖాస్తులు రాలేదు. మరో మూడు రోజులు కాదు.. మూడు నెలలు పొడిగించినా.. దరఖాస్తులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే కానీ, బార్ కేటాయింపునకు లాటరీ తీయరాదనే నిబంధన ఉండటంతో ఎకై ్సజ్ అధికారులకు ఒత్తిళ్లు తప్పడం లేదు.
వ్యాపారం తగ్గుతుందని...
జిల్లాలోని మద్యం అమ్మకాలన్నీ కూటమి నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం కేటాయించిన 7 బార్లనూ వారే నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్‌ల వ్యాపారం తగ్గుతుందని కొత్త బార్‌లకు అవకాశం ఇవ్వకుండా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అందువల్లే దరఖాస్తులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అధికారులే చెబుతున్నారు.
అందని దరఖాస్తులు.. అధికారులపై ఒత్తిడి..
జిల్లాలో మడకశిర, ధర్మవరం–1, ధర్మవరం–2, కదిరి, హిందూపురం ప్రాంతాల్లో మద్యం బార్ల ఏర్పాటుకు ఎకై ్సజ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు విధించారు. తగినన్ని దరఖాస్తులు అందని పరిస్థితుల్లో ఈనెల 17వ తేదీ వరకు గడువు పొడిగించారు. అయితే ఇప్పటి వరకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఇన్ని రోజులుగా రాని దరఖాస్తులు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కూటమి నేతలు సిండికేటుగా మారి ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఎకై ్సజ్ అధికారులపై తీవ్ర ఒత్తిడి ఉంది.
మొన్న కూడా 4 చొప్పునే..
బార్ల టెండర్లలో ప్రభుత్వం నూతన నిబంధనలు విధించింది. కనీసం నాలుగు దరఖాస్తులు అందితేనే లాటరీ తీయాలని ఆదేశించింది. దీంతో గత నెలలో జిల్లాలోని 12 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, అందులో ఆరు బార్లకు కేవలం నాలుగు చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. నిబంధన మేరకు నాలుగు దరఖాస్తులు వేయాలి కాబట్టి కూటమి నేతలే వేసినట్లు సమాచారం. మిగతా వారు దరఖాస్తు చేయనీయకుండా బెదిరింపులతో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసిన బార్‌కు మాత్రం 11 మంది పోటీ పడటం గమనార్హం.
ఒక్క దరఖాస్తూ కష్టమే..
హిందూపురంలో ఇప్పటికే మూడు బార్లు ఉన్నాయి. దీంతో మరో బార్‌కు దరఖాస్తులు రాకుండా మిగిలిన బార్ ఓనర్లు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అక్కడ ఒక్క దరఖాస్తు కూడా కష్టమే. కదిరిలో ఇప్పటికే రెండు బార్లు నడుస్తున్నాయి. దీంతో మరో బార్ వద్దనే నిర్ణయానికి వచ్చారు. మడకశిరలో ఒక బార్ ఏర్పాటుకు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ... కర్ణాటక సరిహద్దు కావడం... ఈ ప్రాంత వాసులు కర్ణాటక మద్యానికి మొగ్గు చూపడంతో వ్యాపారం జరగని ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక ధర్మవరంలో ఇప్పటికే ఒక బార్ నడుస్తోంది. మరో రెండు బార్లకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ దరఖాస్తులు అందలేదు.
దరఖాస్తులు వస్తేనే లాటరీ
ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తాం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉన్నాయి. ఒకట్రెండు దరఖాస్తులు వస్తే.. ఫీజు వెనక్కి చెల్లించి లాటరీ ప్రక్రియ రద్దు చేస్తాం. మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. దరఖాస్తులు వేయనీయకుండా నాయకుల బెదిరింపుల అంశం నా దృష్టికి రాలేదు. – గోవిందనాయక్,
ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి
గడువు సమీపిస్తున్నా
బార్లకు దరఖాస్తులు నిల్
అప్లికేషన్లు వేయనీయకుండా అడ్డగింత
కూటమి నేతలు సిండికేటుగా మారి బెదిరింపులు
12 బార్లలో 7 దుకాణాలకు ఫుల్.. ఐదింటికి మళ్లీ నోటిఫికేషన్
అయినా స్పందన లేక
ఎకై ్సజ్ అధికారుల తిప్పలు
మరో మూడు రోజులు
గడువు పొడిగించిన వైనం