
ఎంపికై న అభ్యర్థులూ తరలిరండి : డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరూ ఈ నెల 19న అమరావతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. మంగళవారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న అభ్యర్థితో పాటు తోడుగా మరొకరు విజయవాడకు రావచ్చన్నారు. ప్రయాణ ఖర్చులు, వసతి, భోజన సదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 18న ఉదయం 6 గంటలకు అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డులోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలన్నారు. ప్రతి బస్సుకు నలుగురు చొప్పున లైజన్ ఆఫీసర్లను నియమిస్తామన్నారు. 19న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం చంద్రబాబుతో మీటింగ్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరికీ కిట్టుతో పాటు అపాయింట్‌మెంట్ ఆర్డర్ అందజేస్తారని, అదే రోజు రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం జిల్లాకు చేరుకుంటారన్నారు.
ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం
● ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్
● జిల్లా అడహాక్ కమిటీ ఎన్నిక
పుట్టపర్తి టౌన్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్లపాటి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం ఎన్జీఓ నాయకులు పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆర్‌వీజే కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా నాయకుడు లింగా రామ్మోహన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్లపాటి విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్డీఓ అసోసియేషన్ కట్టుబడి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి చాలా సమస్యలున్నాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్న నమ్మకంతో ఉన్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటమే శరణ్యమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణతోపాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా నూతన అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా లింగా రామ్మోహన్, కమిటీ సభ్యులుగా శంకరనారాయణ, కదిరి వేణుగోపాల్‌రెడ్డి, లలితమ్మ, లోకేశ్వర్‌రెడ్డి, ఈశ్వరప్ప తదితరులను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి ఉద్యోగులు, సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. పూలమాలలు, శాలువతో సత్కరించారు.