
‘మెరిట్’ లిస్ట్.. ‘సెలక్షన్’ ట్విస్ట్
అనంతపురం ఎడ్యుకేషన్: మెరిట్ జాబితాలో ముందున్న అభ్యర్ధుల కంటే వెనుక ఉన్న వారు పోస్టులకు ఎంపికవడంతో అర్హులైన డీఎస్సీ – 25 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పారదర్శకత పేరుతో అభ్యర్థులకు పూర్తిస్థాయి సమాచారం చేరవేయకుండా రాష్ట్రస్థాయి అధికారులే ఎంపిక ప్రక్రియ చేపట్టడం వివాదానికి కారణమైంది. ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే ఎంపిక చేసి సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఒకట్రెండు కాదు.. మొత్తం 5 సార్లు నిపుణులతో సర్టిఫికెట్ల పరిశీలన చేయించారు. కాల్‌లెటర్లు అందని అభ్యర్థులు, ఏవైనా సర్టిఫికెట్లు పొందుపరచని వారు ఉంటే చివరి విడత వరకూ అవకాశం కల్పించారు. అయినా అర్హులు అనర్హులుగా, అనర్హులు అర్హుల జాబితాలో కనిపిస్తుండడంతో ఆందోళన మొదలైంది.
తనకంటే వెనకున్న వారిని ఎంపిక చేశారంటూ..
బీసీ–ఏ కేటగిరీకి చెందిన ఎ.ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ మెరిట్ జాబితాలో 48వ ర్యాంకులో ఉన్నాడు. సర్టిఫికెట్ల పరిశీలన రోజు ఒరిజనల్ పత్రాలు లేని కారణంగా ఫ్రీజింగ్ జాబితాలో ఉంచారు. గడువులోపు ఎస్‌వీయూకు వెళ్లి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి అధికారులకు అందజేయడంతో అన్‌ఫ్రీజ్ చేసి అర్హత జాబితాలో ఉంచారు. చివరకు అతని కంటే తక్కువ మార్కులు, తక్కువ ర్యాంకు వచ్చిన వారికి ఉద్యోగం వచ్చింది. సెలక్షన్ జాబితాలో ఆంజనేయులు పేరు మాయమైంది. ఇలా అతని కంటే వెనకున్న 8 మందిని అర్హుల జాబితాలోకి చేర్చడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీఈటీ రెండు పోస్టులకూ ఎంపికై న చంద్రిక.. కేజీబీవీలో పని చేస్తూ బీపీఈడీ చేసిందనే నెపంతో ఎస్‌ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టు కాకుండా యూజీపీడీ అర్హతతో పీఈటీ పోస్టుకు ఎంపిక చేశారు. తుది జాబితాలో మాత్రం అమె కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి పేర్లు కనిపిస్తున్నా.. చంద్రిక పేరు మాత్రం లేదు. తమకు జరిగిన అన్యాయంపై వీరిద్దరూ డీఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అనర్హుడికి దివ్యాంగుల కోటాలో ఉద్యోగం
కె.శ్రీనివాసులు అనే వ్యక్తి మానసిక అనారోగ్యం (ఎంఐ) కేటగిరీలో మెరిట్ జాబితాకు ఎంపికయ్యాడు. వెరిఫికేషన్ సమయంలో 70 శాతం వైకల్యం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ చూపించాడు. ఆ సర్టిఫికెట్ ఆధారంగా వెరిఫికేషన్ బృందం తుది నిర్ధారణగావించి అప్‌లోడ్ చేసింది. అనంతరం మెడికల్ సర్టిఫికెట్ ధ్రువీకరణ కోసం అతడిని సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయకముందే శ్రీనివాసులు ఉడాయించాడు. ఇంతలో మతలబు ఏమి జరిగిందో ఏమో కానీ నేరుగా విజయవాడకు వెళ్లి విద్యాశాఖ కమిషనర్‌ను కలిసి, మళ్లీ వైద్య పరీక్షలు చేయించాలంటూ అక్కడి నుంచి ఆదేశాలు తీసుకొచ్చాడు. దీంతో డీఈఓ స్వయంగా రంగంలోకి దిగి సదరు అభ్యర్థిని సర్వజన ఆస్పత్రికి తీసువెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఎలాంటి మానసిక ఆరోగ్యం లేదని వైద్యులు ధ్రువీకరించారు. వైకల్యశాతం ‘0’గా నిర్ధారించారు. ఈ సర్టికెట్‌ను అప్‌లోడ్ చేసి అనర్హుడిగా నిర్ధారించాల్సి ఉంది. మరి ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయనకు మాత్రం ఉద్యోగం వచ్చింది. ఆస్పత్రి నుంచి ఉడాయించిన రోజే మెడికల్ టెస్ట్‌కు గైర్హాజరు కారణంగా అనర్హుడి జాబితాలో ఉంచాలని డీఈఓ ఆదేశించినా.. వెరిఫికేషన్ బృందం ధిక్కరిస్తూ అర్హుడి జాబితాలో ఉంచడం వెనుక ఆంతర్యమేమిటి? దీని వెనుక ఎవరు చక్రం తిప్పారనే చర్చ జోరుగా జరుగుతోంది.
20 మందికి పైగా అభ్యర్థుల పేర్లు గల్లంతు
జిల్లా అధికారుల వద్ద సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరై పోస్టులు రాని వారు దాదాపు 20 మందికిపైగా ఉన్నారు. వాస్తవానికి ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. కాల్‌లెటర్లు అంది సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినా తుది జాబితాలో వారి పేర్లు కనిపించలేదు. మరి ఇంత మంది సెలక్షన్ జాబితాలో ఎందుకు లేరనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ లాజిక్ పీటముడి అధికారులకే తెలియాలని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో పలువురు అభ్యర్థులు డీఈఓ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వారు ఇస్తున్న అర్జీలను తీసుకుంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని డీఈఓ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో గందరగోళం
ఒకే కేటగిరీలో వెనకున్న అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు
వైకల్యమే లేకున్నా దివ్యాంగుల కోటాలో ఉద్యోగం