
నిధులు మేసి..దాడి చేసి
పుట్టపర్తి: పొదుపు సంఘంలోని నిధులను సభ్యులకు తెలియకుండా స్వాహా చేసిన ఓ మాజీ లీడర్...డబ్బు తిరిగి కట్టాలని కోరిన సంఘం సభ్యులపై, వారికి మద్దతు తెలిపిన సీపీఎం నాయకులపై బంధువులతో కలిసి దాడులకు దిగారు. ఈ ఘటన బుక్కపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బుక్కపట్నంలోని శ్రీసంతోషి మహిళా సంఘానికి గతంలో కోమల అనే మహిళ లీడర్‌గా ఉండేది. ఈక్రమంలో 8 నెలల క్రితం ఆమె సభ్యులకు తెలియకుండా సంఘం నిధులు రూ.7.50 లక్షలు సొంతానికి వాడుకుంది. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు ఆమెను లీడర్‌గా తొలగించడంతో పాటు సొంతానికి వాడుకున్న నిధులు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పుడు నెలరోజులు గడువు కోరిన కోమల... ఆ తర్వాత కూడా డబ్బు చెల్లించలేదు. ఈ క్రమంలో చాలాసార్లు సంఘం సభ్యులు కోమలను డబ్బుకోసం నిలదీయడం ఆమె ఎదురుదాడికి దిగడం జరిగాయి. ఇప్పటికి 8 నెలలు దాటినా కోమల డబ్బు చెల్లించలేదు. దీంతో సోమవారం రాత్రి సంఘం సభ్యులంతా కలిసి కోమల ఇంటి వద్దకు వెళ్లారు. సంఘం డబ్బులు రూ.7.50 లక్షలు చెల్లించాలని కోరారు. అంతవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని చెప్పారు. దీంతో కోమల, ఆమె కుటుంబీకులు సంఘంలోని సభ్యులైన మహిళలపై దాడి చేశారు. దీంతో వారంతా సోమవారం రాత్రే బుక్కపట్నం పోలీసు స్టేషన్‌కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు.
వెలుగు కార్యాలయం ముందు ధర్నా
మంగళవారం ఉదయం కూడా శ్రీసంతోషి మహిళ సంఘం సభ్యులు స్థానిక సీ్త్రశక్తి భవనం ముందు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మహిళలకు మద్దతుగా సీపీఎం జిల్లా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈ.ఎస్ వెంకటేష్, బ్యాళ్ల అంజి తదితరులు కార్యాలయానికి వెళ్లి కోమల స్వాహా చేసిన నిధులు తిరిగి కట్టించాలని కోరారు. అయితే కోమలకు మద్దతుగా నిలిచిన యానిమేటర్ నాగరాజు, సిబ్బంది సీపీఎం నాయకులను అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారు. దీంతో వారు బుక్కపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు స్వాహా అయిన నిధులు తిరిగి రికవరీ చేయాలని కోరారు. ఈ ఘటనపై ‘వెలుగు’ సీసీ రవిని వివరణ కోరగా... శ్రీసంతోషి పొదుపు సంఘంలోని డబ్బులు స్వాహా జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఆ సొమ్ము రికవరీ చేయాలని కోమల అనే మాజీ లీడర్‌ను పీడీ ఆదేశించారని, సీపీఎం నేతలు, యానిమేటర్లు ఇరు వర్గాలు తోపులాడుకుంటుంటే తాము వారిని సముదాయించామన్నారు.
బుక్కపట్నం ‘శ్రీసంతోషి’ సంఘం నిధులు స్వాహా
రూ.7.5 లక్షలు సొంతానికి వాడుకున్న మాజీ లీడర్ కోమల
తిరిగి చెల్లించాలని కోరిన సభ్యులు, సీపీఎం నాయకులపై దాడి
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

నిధులు మేసి..దాడి చేసి