
నేడు ‘అన్నదాత పోరు’
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి అర్బన్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు పరిస్థితి అగమ్యగోచరమైంది. సీజన్‌కు ముందే పంటలసాగును అంచనా వేసి ఎరువులు తెప్పించాల్సిన పాలకులు నిర్లక్ష్యం వహించడంతో రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచిపోయినా... ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు ఒక్క ఎరువు బస్తా కూడా చేర్చలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు మానుకుని రోజూ మండల కేంద్రాల్లోని ఫర్టిలైజర్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మే నెలాఖరులోపే రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను చేర్చేదని, గ్రామాల్ల్లోనే కావాల్సినన్ని ఎరువులు అందించేదని గుర్తు చేసుకుంటున్నారు.
బ్లాక్ దందా..
జిల్లాలో కావాల్సినంత యూరియా ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఏ దుకాణంలో వెళ్లి అడిగినా లేదనే అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదనుగా.. కొందరు వ్యాపారులు, కూటమి నేతలు సిండికేటుగా మారి యూరియాను దారి మళ్లించి.. అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం యూరియా బస్తా రూ.267కు ఇస్తామంటోంది. కానీ బహిరంగ మార్కెట్‌లో బస్తా రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వాళ్లు వచ్చే లోపు దుకాణం సర్దేస్తున్నారు.
డిమాండ్ ఉన్నప్పటికీ..
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో సుమారు 75 వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. మరో 63 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు వేశారు. ఖరీఫ్‌లో వరి పంట 7 వేల హెక్టార్లలో.. మొక్కజొన్న 16 వేలకు పైగా హెక్టార్లలో సాగులో ఉన్నాయి. వరి, మొక్కజొన్న పంటలకు యూరియా ఎక్కువగా వినియోగిస్తారు. ఎకరా వరి పంటకు నాలుగు బస్తాల వరకు యూరియా వేస్తారు. అదే మొక్కజొన్న పంటకు అయితే ఎకరాకు 5 నుంచి 8 బస్తాల వరకు విడతల వారీగా వినియోగించాలి. జిల్లాలో కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, ఇంకో 2 వేల టన్నుల కోసం ఇండెంట్ పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఏ రైతును పలకరించినా.. యూరియా దొరకలేదని చెబుతున్నారు.
బయో కొంటేనే..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో యూరియాను బ్లాక్ చేసిన కొందరు వ్యాపారులు ధర భారీగా పెంచారు. రూ.267 చొప్పున విక్రయించాల్సిన యూరియా బస్తాను రూ.500 వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అది కూడా తాము సూచించిన బయో ఎరువులను కొంటేనే యూరియా ఇస్తామని షరతు పెడుతున్నారు. దీంతో అవసరం లేకున్నా రైతులు బయో ఎరువులను కొనుగోలు చేస్తున్నారు.
యూరియా కోసం రైతుల ఆందోళన
లేపాక్షి: యూరియా కోసం మండలంలోని కల్లూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 15 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వరా..? అంటూ నిలదీశారు. వివరాల్లోకి వెళితే... కల్లూరు రైతు సేవా కేంద్రం పరిధిలోని పలువురు రైతులకు అధికారులు యూరియా పంపిణీ నిమిత్తం 15 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చారు. సోమవారం యూరియా పంపిణీ ఉందని తెలుసుకున్న వారంతా రైతు సేవా కేంద్రానికి వచ్చారు. అయితే అధికారులు మాత్రం గతంలో టోకెన్లు ఇచ్చిన రైతులను కాదని, కొత్తగా కొంతమందికి టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు. దీంతో గతంలో టోకెన్లు తీసుకున్న రైతులు తమకు తొలుత యూరియా పంపిణీ చేయాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతుల మధ్య వివాదం నెలకొంది. ఓ దశలో రైతులు ఘర్షణకు దిగేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. గతంలో టోకెన్లు తీసుకున్న వారికి పంపిణీ చేసిన తర్వాతే ప్రస్తుతం టోకెన్లు తీసుకున్న రైతులకు యూరియా పంపిణీ చేసేలా అధికారులతో మాట్లాడారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.
యూరియా బారులు
కొత్తచెరువులోని ప్రధాన మంత్రి రైతుల సమృద్ధి కేంద్రం వద్ద ఈనెల 5వ తేదీ (శుక్రవారం) కనిపించిన దృశ్యమిది. మండలంలో చాలా మంది రైతులు ప్రస్తుతం వరినాట్లు వేశారు. ఇప్పుడు యూరియా చల్లకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల రైతులంతా ఉదయమే మండల కేంద్రానికి చేరుకుంటున్నారు. ఈ నెల 5వ తేదీన 160 బస్తాల యూరియా రాగా, టోకెన్లు ఇచ్చి పోలీసుల రక్షణలో పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు గొడవకు దిగగా, దుకాణం మూసివేసి వెళ్లారు. – కొత్తచెరువు:
యూరియా కోసం రైతుల అవస్థలు చూసి చలించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరుబాటకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రైతుల తరఫున వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాకు తలపెట్టింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలనే డిమాండ్‌తో ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేయనున్నారు. జిల్లాలో పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఆర్డీఓ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయా ఆర్డీఓ కార్యాలయాల వద్దకు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు.

నేడు ‘అన్నదాత పోరు’

నేడు ‘అన్నదాత పోరు’

నేడు ‘అన్నదాత పోరు’