● రైతులతో కలెక్టర్ చేతన్
పుట్టపర్తి అర్బన్: ‘‘ పంటల సాగులో అధికారులు సూచించినంత మేరకే మేరకే యూరియా వాడాలి. అధికంగా వాడితే పంటలకు తెగుళ్లు సోకుతాయి’’ అని కలెక్టర్ చేతన్ రైతులకు సూచించారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేసుకోవాలన్నారు. సోమవారం ఆయన పుట్టపర్తి మండలం పెడపల్లి, కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామాలను సందర్శించి అక్కడి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి యూరియా నిల్వ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు పెడపల్లిలో రైతు బ్రహ్మానందరెడ్డి మొక్కజొన్న పంటను పరిశీలించిన కలెక్టర్ రైతుతో మాట్లాడారు. పంటకు ఎంత యూరియా వేశారు...ఎక్కడ కొనుగోలు చేశారంటూ ఆరా తీశారు. అధికారుల సిఫార్సు మేరకే యూరియా, ఎరువులు వాడారా.. అని అడిగి తెలుసుకున్నారు. కొత్తచెరువు మండలంలో యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. అదేవిధంగా హెల్త్ క్లినిక్‌లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్లు కళ్యాణచక్రవర్తి, బాలాంజనేయులు, ఏఓలు శ్రీవాణి, సతీష్, వీఆర్‌ఓలు, వీఓఏలు ఉన్నారు.
జిల్లాలో యూరియా
కొరత లేదు: కలెక్టర్
ప్రశాంతి నిలయం: జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదని, పంటల నమోదు ఆధారంగా రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టీఎస్ చేతన్ తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురిసినా, తగినంత వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ 45,000 హెక్టార్లు, మొక్కజొన్న 15,000 హెక్టార్లు, కంది 16,000 హెక్టార్లు, వరి 4 వేల హెక్టార్లలో సాగులో ఉందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 5,500 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యిందన్నారు. రోజూ సగటున 145 నుంచి 150 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతోందన్నారు. రైతులు ఈనెల 30వ తేదీలోపు ఈ–క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు.
871 మెట్రిక్ టన్నుల యూరియా రాక
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు 871 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోరమాండల్ కంపెనీ (సీఐఎల్) నుంచి 601 మెట్రిక్ టన్నులు, పారాదీప్ ఫాస్పేట్ కంపెనీ (పీపీఎల్) నుంచి 270 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరిందన్నారు. ఇందులో మార్క్‌ఫెడ్‌కు 530 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 341 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ప్రకారం సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
అక్టోబర్ 4న ‘రెడ్‌క్రాస్’ నూతన కమిటీ ఎన్నిక
ప్రశాంతి నిలయం: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహణ కమిటీ ఎన్నిక అక్టోబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి, ఎన్నికల అధికారి కృష్ణానాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారమే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 11 గంటలకు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనుములపల్లి గణేష్ సర్కిల్‌లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి రెడ్‌క్రాస్ సొసైటీ పోషకులు, ఉప పోషకులు, జీవితకాల సభ్యులు, జీవితకాల అనుబంధ సభ్యులందరూ తమ ఆధార్ కార్డు, సభ్యత్వ కార్డులతో హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో కనీసం 10 మంది సభ్యులతో కూడిన జిల్లా రెడ్‌క్రాస్ నూతన నిర్వహణ కమిటీని ఎన్నుకుంటారన్నారు. అదేరోజు కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నిక కూడా జరుగుతుందని వివరించారు.
యూరియా అధికంగా వాడితే తెగుళ్లు