
తనిఖీల భయం... ఎరువుల దుకాణాలకు మూత
ధర్మవరం రూరల్: తనిఖీ చేయడానికి విజిలెన్స్ అధికారులు వస్తున్న సమాచారంతో ధర్మవరం పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం నిర్వాహకులు మూతేశారు. తనిఖీ అధికారుల్లోని కింద స్థాయి సిబ్బంది ముందుగా సమాచారం ఇవ్వడంతో అందరూ జాగ్రత పడ్డారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేయడానికి వచ్చిన రైతులు మూత పడిన దుకాణాలను చూసి గంటల తరబడి ఎదురు చూశారు. అసలే యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కనీసం కాంప్లెక్స్ ఎరువులైన తీసుకెళ్లదామని వస్తే దుకాణాలు మూతేయడంతో అసహనానికి గురయ్యారు. దుకాణాల్లో అక్రమ నిల్వలు, నకిలీ మందులు లేకుంటే ఎందుకు మూతేస్తారని, నిజాయితీగా వ్యాపారం సాగించకుండా ఇంత కాలం మోసగిస్తూ వచ్చారంటూ మండిపడ్డారు.
జాతీయ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన
ధర్మవరం: చేనేత డిజైన్ డెవలప్‌మెంట్‌లో జాతీయ స్థాయి అవార్డు అందుకున్న ధర్మవరం పట్టణానికి చెందిన జుజారె నాగరాజును కలెక్టర్ టీఎస్ చేతన్ గురువారం తన చాంబర్‌లో అభినందించారు. అవార్డు కింద కేంద్ర ప్రభుత్వం అందజేసిన తామ్ర పత్రం, సర్టిఫికెట్లను పరిశీలించారు. కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్ ఏడీ రామకృష్ణ, ఏపీసీఓ మేనేజర్ సుబ్బరావు పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనాల ఢీ..
● వ్యక్తి మృతి
కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల వద్ద గురువారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముదిగుబ్బ మండలం నాగులగుబ్బ గ్రామానికి చెందిన రామాంజనేయులు(40) మృతి చెందాడు. ఈ మేరకు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. గాండ్లపెంటలో ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా స్థానిక పులివెందుల క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్నాడు. తలకు రక్తగాయాలైన రామాంజనేయులును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి సోదరుడు రమణప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు, కదిరికి చెందిన పౌజన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

తనిఖీల భయం... ఎరువుల దుకాణాలకు మూత