
కర్ణాటక సరిహద్దున దారుణ హత్య
ఓడీచెరువు (అమడగూరు): కర్ణాటక సరిహదులోని అమడగూరు మండలం ఆకులోల్లపల్లి సమీపంలో కర్ణాటకలోని బిల్లూరు పంచాయతీ దేవరంక గ్రామానికి ముత్తప్ప (47) దారుణ హత్యకు గురయ్యాడు. సమీప బందువులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని చింతామణికి చెందిన శ్రీనివాసరెడ్డి, దేవరంక గ్రామానికి చెందిన ముత్తప్ప రెండేళ్లుగా భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 12 ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో లలరోజూ సొంతూరు నుంచి కూలీలను తీసుకెళ్లి పనులు చేయించేవారు. బుధవారం సాయంత్రం టమాటలు లోడ్ చేయించి మార్కెట్‌కు తరలించిన అనంతరం ముత్తప్ప స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అమడగూరు మండలం ఆకులోల్లపల్లి సమీపంలో వంకలోకి చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే హతమయ్యాడు. సమాచారం అందుకున్న పుట్టపర్తి డీఎస్పి విజయ్‌కుమార్, నల్లమాడ సీఐ నరేంద్రరెడ్డి, ఓడీచెరువు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, డాగ్ స్క్వాడ్, ఫోర్సెనిక్ నిపుణులు గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలపై 2 కత్తిపోట్లు, గొంతు ఎడమ వైపు బలమైన గాయాలను గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.