
కలిసి రాని ఖరీఫ్
కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే పలకరించినా.. వర్షాలు మాత్రం ఆలస్యంగానే కురిశాయి. రైతులందరినీ సేద్యంలోకి దింపుతూ వరుణుడు మొహం చాటేయడంతో ఖరీఫ్ పంట కాలం కాస్త అన్నదాతలకు కలిసి రాకుండా పోయింది. విత్తు వేసేందుకు వెనుకాడడంతో ఈ ఖరీఫ్‌లో కీలకమైన వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.
పుట్టపర్తి అర్బన్: ఈ ఏడాది రైతులకు ఏదీ కలిసి రాలేదు. ఖరీఫ్ సీజన్‌లో విస్తారంగా సాగయ్యే వేరుశనగ, కంది, వరి తదితర పంటలు తీవ్ర వర్షాభావం కారణంగా విత్తు వేసేందుకు రైతులు భయపడ్డారు. చెరువుల్లోకి నీళ్లు వస్తాయో రావో కూడా తెలియని అయోమయ స్థితిలో ఆయకట్టు భూముల్లో వరి సాగు చేపట్టలేకపోయారు. కేవలం బోరు బావుల కింద మాత్రమే అక్కడక్కడ వరి సాగులోకి వచ్చింది. వరి పంటకు మంచి అదును అయిన జూన్, జూలై మాసాలు వెళ్లి పోయాయి. ఆగస్టులో పంట వేస్తే దిగుబడి అంతంత మాత్రమే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వర్షాభావం కారణంగా బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గనుండడంతో తక్కువ నీటితో సాగయ్యే వేరుశనగ, మొక్కజొన్న, రాగి తదితర పంటలను మాత్రమే సాగు చేస్తున్నారు. సాధారణంగా నాలుగు నుండి ఆరు నెలల పంట కాలమైన వరి సాగుకు చాలా మంది రైతులు వెనుకంజ వేశారు. ఫలితంగా రాబోవు రోజుల్లో బియ్యానికి ఇబ్బందులు తప్పవనే సంకేతాలు ప్రజలను కలవరపరుస్తోంది.
గణనీయంగా తగ్గిన వరి సాగు
జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో అత్యధికంగా వరి సాగు చేస్తారు. 6,396 హెక్టార్లలో వరి సాధారణ సాగు కాగా, ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకూ 720 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. వరి సాగుకు ఈ ఏడాది ఖర్చులు కూడా భారీ పెరిగాయని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్ బాడుగలు, కూలీలు, ఎరువులు, మందుల పిచికారీకి ఎకరాకు సుమారు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ ఖర్చు అవుతోందన్నారు. ఇక ఆగస్టులో సాగు చేసిన వరి పంటకు అధికంగా చీడ పీడలు ఆశిస్తాయని వ్యవసాయాఽధికారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు పంట ఆలస్యమయ్యే కొద్దీ మంచు కురిసే సమయం వస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
ఆలస్యంగా కురిసిన వర్షాలు
తగ్గిన వరి సాగు
6వేల హెక్టార్లకు గాను 700 హెక్టార్లకే పరిమితం
రానున్న రోజుల్లో బియ్యానికి కటకటే

కలిసి రాని ఖరీఫ్