
చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తాం
ధర్మవరం: రాష్ట్రంలో చేనేత రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరంలోని కదిరిగేటు వద్ద గురువారం చేనేత విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి, మాట్లాడారు. సంస్కృతికి, మన ప్రత్యేకతకు నిదర్శనంగా ఉన్న చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చేనేత మగ్గాల నిర్వహణకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా రూ.25వేలు చెల్లిస్తామన్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రా మెటీరియల్ సరఫరా పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలో రూ.164కోట్లు చెల్లించగా, ఇందులో రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించినట్లు వెల్లడించారు. మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను ధర్మవరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందు కోసం మార్కెట్ యార్డులో 10 ఎకరాల స్థలాన్ని గుర్తించి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నామన్నారు. ధర్మవరం పట్టణంలో నెలకొన్న అధిక లోడ్ సమస్యపై విద్యుత్‌శాఖతో సంప్రదించి ప్రత్యేకంగా రూ.110 కోట్లతో వ్యయంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి పొందే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇది పూర్తయితే ధర్మవరంలో మగ్గాలకు ఎలాంటి విద్యుత్ లోపం ఉండదన్నారు. అనంతరం ఉత్తమ చేనేత కార్మికులుగా ఎంపికై న కాంతమ్మ, ఆంజనేయులు, ఈశ్వరయ్య, రామకృష్ణను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో కలెక్టర్ టీఎస్ చేతన్, పరిటాల శ్రీరామ్, చిలకం మధుసూదన్‌రెడ్డి, చేనేత జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్ కన్నబాబు, ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రి సత్యకుమార్