
ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వీఆర్‌ఓ అరెస్ట్
గుంతకల్లు టౌన్: ఏడు నెలల గర్భిణిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వీఆర్‌ఓను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు గుంతకల్లు వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. గుంతకల్లులోని సోఫియా స్ట్రీట్‌కు చెందిన షేక్ షమీమ్ భానూ తన కుమారుడి పేరును రేషన్ కార్డులో నమోదు చేయించుకునేందుకు సచివాలయానికి వెళ్లిన సమయంలో వీఆర్‌ఓ మహమ్మద్ వలి పరిచయమయ్యాడు. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. షమీమ్‌కు సంబంధించిన బంగారాన్ని ఆమె పేరిట బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2 లక్షల రుణం తీసుకున్న వలి ఆ డబ్బును తన స్వప్రయోజనాలకు వాడుకున్నాడు. అనంతరం ఆమె బాగోగులు పట్టించుకోలేదు. భర్త చేసిన మోసంపై గత నెల 14న గుంతకల్లు వన్‌టౌన్ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై కేసు నమోదు చేయించినందుకు కక్ష కట్టి ఆమెను వేధింపులకు గురిచేస్తూ ‘ఎక్కడైనా పడి చావు.. నువ్వు చచ్చిపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుంది’ అని నిర్ధయగా మాట్లాడాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన షమీమ్ బుధవారం విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి షేక్ పీర్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, వీఆర్‌ఓ వలిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
అనంతపురం: అనారోగ్యంతో మృతి చెందిన కంబదూరు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ మృతదేహానికి అనంతపురంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అనంతపురంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం ఆరో రోడ్డులోని శ్మశాన వాటికలో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం రూరల్ సీఐ నీలకంఠ, ఎస్‌ఐ లోకేష్, కంబదూరు ఏఎస్‌ఐ ఓబుళపతి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడ్‌హక్ కమిటీ సభ్యులు, మృతుడి కుటుంబ సభ్యులు , బంధువులు పాల్గొన్నారు. కాగా, రమేష్ మృతిపై ఎస్పీ జగదీష్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తక్షణ సాయం కింద రూ.లక్షను రమేష్ భార్య రామలక్ష్మికి అందజేశారు.

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో వీఆర్‌ఓ అరెస్ట్