
ఉప ఎన్నికను హింసాత్మకంగా మార్చారు
● మాజీ మంత్రి శంకరనారాయణ
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో ఉప ఎన్నికలను టీడీపీ నేతలు హింసాత్మకంగా మార్చారంటూ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనాయణ ధ్వజమెత్తారు. ఏకంగా ప్రజాప్రతినిధులపైనే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, మరో నేతపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ది మూరెడు అరాచకం బారెడుగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు అభివృద్ధిని పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీ నాయకులే లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.
ఎన్నికల్లో గెలవలేరనే దాడులు
● ఎమ్మెల్సీ మంగమ్మ
పుట్టపర్తి టౌన్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేరని స్పష్టం కావడంతో అక్కసు తాళలేక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, మరో నేతపై టీడీపీ గుండాలు దాడికి తెగబడ్డాయని ఎమ్మెల్సీ మంగమ్మ మండిపడ్డారు. దాడిని ఆమె ఖండించారు. దాదాపు వంద మంది కట్టెలు, రాళ్లతో దాడులకు తెగబడి భయానక వాతావరణం సృష్టించారన్నారు. సుపరిపాలన చేయడం చేతకాక రెడ్‌బుక్ రాజ్యాంగంతో దౌర్జన్యాలకు తెరలేపారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు.
గోరంట్లలో చైన్ స్నాచింగ్
గోరంట్ల: వాకింగ్ చేస్తున్న మహిళ మెడలోని బంగార్ గొలుసును దుండగులు లాక్కెళ్లారు. గురువారం సాయంత్రం గోరంట్ల పట్టణానికి చెందిన నాగిరెడ్డి భార్య శ్రీలత, మరో మహిళ శింగిరెడ్డిపల్లి వైపు వాకింగ్‌కు వెళ్తూండగా గోరంట్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు శ్రీలత మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించారు. భాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
రొద్దం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రొద్దం మండలం నల్లూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన రెడ్డిపల్లి గంగన్న కొడుకు శ్రీనివాసులు(40)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసైన శ్రీనివాసులు తరచూ తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ ఇంట్లో గొడవపడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో గొడవ పడి డబ్బులు ఇవ్వకపోవడంతో ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసి శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు మంటలు ఆర్పి కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి ఆయన మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.
డాక్టర్ రమణ చుట్టూ
బిగుసుకుంటున్న ఉచ్చు
● క్రిమినల్ కేసు నమోదుకు
అనంత ఇన్‌చార్జ్ కలెక్టర్ సిఫారసు
అనంతపురం మెడికల్: గర్భిణి మృతి అంశానికి సంబంధించి ప్రభుత్వ సర్వజనాస్పత్రి సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్‌కు చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ నెల 3న చెదళ్ల గ్రామానికి చెందిన గర్భిణికి రాధమ్మ(29)కు శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీకృప ఆస్పత్రిలో డాక్టర్ రమణనాయక్ సర్జరీ చేస్తుండగా ఆపరేషన్ టేబుల్‌పైనే మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో సీజ్ చేసిన ఆస్పత్రిని గుట్టుచప్పుడుగా తెరిచి శస్త్రచికిత్సలు చేయడంతో పాటు పీసీ పీఎన్‌డీటీ యాక్ట్ అతిక్రమణ, తదితర తప్పిదాలు చేసినట్లు డాక్టర్ రమణ నాయక్‌పై అభియోగాలు మోపుతూ అనంతపురం ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ శివ్‌నారాయణ్ శర్మకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఇన్‌చార్జ్ కలెక్టర్... డాక్టర్ రమణనాయక్‌పై క్రిమినల్ కేసు నమోదుకు సిఫారసు చేశారు. కాగా, కేసు నమోదుకు మూడో పట్టణ పీఎస్ సీఐ శాంతిలాల్ నిరాకరించడంతో ఈ నెల 6న ఎస్పీని కలిసేందుకు ఆరోగ్యశాఖ డెమో సిబ్బంది, లీగల్ అడ్వైజర్ వెళ్లారు. ఆ సమయంలో ఎస్పీ లేకపోవడంతో ఇన్‌చార్జ్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా డాక్టర్ రమణ నాయక్ సెలవులో వెళ్లినట్లు తెల్సింది. అలాగే గర్భిణి మృతికి సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఉద్యోగ అవకాశాలు
కల్పించడమే లక్ష్యం
అనంతపురం: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రతన్ టాటా ప్రాంతీయ ఇన్నోవేషన్ హబ్ డైరెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. గురువారం జేఎన్‌టీయూ అనంతపురంలోని రతన్‌టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ హబ్ కేంద్రంలో బోర్డు సమావేశం నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక బాధ్యత కింద పారిశ్రామిక సంస్థల ద్వారా నిధులను సమకూర్చడం జరుగుతుందన్నారు. సామాజిక వ్యాపారం, గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలలో ఎక్కువగా యువత ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయన్నారు.

ఉప ఎన్నికను హింసాత్మకంగా మార్చారు

ఉప ఎన్నికను హింసాత్మకంగా మార్చారు