
భూసేకరణ వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకై భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్టెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత సమగ్ర నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ అధికారులు, నెడ్‌క్యాప్ అధికారులు, వివిధ సోలార్ పవర్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసు నమోదు
కొత్తచెరువు: మండలంలోని లోచర్ల గ్రామానికి చెందిన హరిజన దామోదర, హరిజన లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన కిత్తర నారాయణ, మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు కొత్తచెరువు సీఐ మారుతీశంకర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కిత్తర నారాయణ, మరో ముగ్గురు మద్యం సేవించి దామోదర, లక్ష్మయ్యను ఊరి నడిబొడ్డున కులం పేరుతో దూసిస్తూ చెప్పులతో, కాళ్ళతో కొట్టారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
11న జిల్లా జైలులో వేరుశనగ చెక్క వేలం
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని జిల్లా జైలులో ఈ నెల 11న 25 వేల కిలోల వేరుశనగ చెక్కకు వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ అనిల్‌బాబు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం ప్రక్రియలో పాల్గొనే వారు రూ. 20వేల ధరావత్తు చెల్లించాలి. ప్రక్రియ ముగిసిన తర్వాత ధరావత్తును వెనక్కు చెల్లిస్తారు.