
క్షణికావేశం.. బైక్ ధ్వంసం
సాక్షి, పుట్టపర్తి: క్షణికావేశం సుమారు రూ.25వేల మూల్యం చెల్లించేలా చేసింది. ఓ యువకుడు ఆవేశంతో రగిలిపోతూ బైక్‌ను రాళ్లతో ధ్వంసం చేసి నిప్పు పెట్టబోయాడు. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో మంటలు రేగలేదు. అనంతరం పోలీసుల జోక్యంతో తప్పు తెలుసుకుని బైక్ రిపేరీకి అయ్యే ఖర్చు భరిస్తానని అంగీకరించాడు. వివరాలు.. మామిళ్లకుంట క్రాస్‌కు చెందిన తిరుమలేష్.. మంగళవారం ఉదయం పుట్టపర్తి నుంచి ప్యాషన్ ప్రో బైక్‌పై వెళుతూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో వై–జంక్షన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బాలుడి స్కూటర్ పరస్పరం ఢీకొన్నాయి. ఆ సమయంలో తిరుమలేష్ గట్టిగా కేకలు వేయడంతో భయపడిన బాలుడు తన స్కూటర్‌ను వదిలేసి పారిపోయాడు. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న తిరుమలేష్.. రాళ్లతో స్కూటర్‌ను చిత్తుచిత్తు చేశాడు. విడి భాగాలను చెల్లాచెదురు చేశాడు. నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. అంతలోనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కాగా, ఒంగోలుకు చెందిన ఓ కుటుంబం దిన కూలి నిమిత్తం ప్రశాంతి గ్రామ్‌లో నివాసముంటున్నారు. మొహర్రం కావడంతో కుమారుడికి స్కూటర్ ఇచ్చి చికెన్ కోసం పంపించారు. వై–జంక్షలో ఎదురుగా బైక్ దూసుకురావడంతో అయోమయంలో అటు.. ఇటు వాహనం తిప్పి కిందపడ్డాడు. అవతలి వ్యక్తి కేకలు వేయడంతో పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకునేలోపు స్కూటర్‌ను సదరు వ్యక్తి ధ్వంసం చేయడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ధ్వంసమైన వాహనాన్ని తానే రిపేరీ చేయిస్తానని తిరుమలేష్ అంగీకరించడంతో సమస్యకు పరిష్కారం దొరికింది. స్కూటర్ విలువ రూ.20 వేల వరకు ఉండవచ్చునని, ప్రస్తుతం రిపేరీకి రూ.25 వేల వరకు అవుతుందని అంచనా వేసిన స్థానికులు క్షణికావేశం ఎంత పని చేసిందని చర్చించుకున్నారు.