మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు

Jul 24 2025 8:43 AM | Updated on Jul 24 2025 8:55 AM

మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు

మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు

ప్రశాంతి నిలయం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ఎస్పీ రత్నతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకొని మాదక ద్రవ్యాల రవాణా ఎక్కువగా సాగే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాలన్నారు. గంజాయి నేరస్తులపై ‘పీఐటీపీఎన్‌డీఎస్‌ యాక్ట్‌ 1988’ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే డ్రగ్స్‌ సరఫరా ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థలకు 100 మీటర్లు పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సీఓటీపీఏ యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రతి విద్యా సంస్థలో ‘ఈగల్‌ క్లబ్‌లు’ త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాల గురించి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఏ మెడికల్‌ షాపులోనూ ఎన్‌ఆర్‌ఎక్స్‌ ట్యాబ్లెట్స్‌ విక్రయించరాదన్నారు. యువత కూడా డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోకూడదన్నారు. జిల్ల్లాలో ఎక్కడైనా డ్రగ్స్‌ వాడకం, రవాణాపై సమాచారం తెలిసిన వారు 1972 టోల్‌ఫ్రీకి ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

జిల్లాలో నిఘా పెంచాం

ఎస్పీ రత్న మాట్లాడుతూ... జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఈగల్‌ టీమ్స్‌ ద్వారా మాదక ద్రవ్యాల నిరోధం, వాడకంపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ హాస్టళ్లలో డ్రగ్స్‌ వినియోగం జరగకుండా పర్యవేక్షణ ఉంచాలన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలి

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అంతరాయం లేని విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. లోవోల్టేజీ సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఉచిత ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు

జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా స్థాయి ఉచిత ఇసుక సరఫరా కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌ మాట్లాడుతూ.. సీసీ రేవు, పీసీ రేవు ఇసుక రీచ్‌లలో రెవెన్యూ, పోలీస్‌ సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు చెక్‌ పోస్టుల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నదీ ప్రవాహాలకు సమీపంలోని గ్రామాల వారు సొంత అవసరాలకు ఇసుకను తవ్వుకుని తరలించుకోవచ్చన్నారు. సమావేశంలో ఎస్పీ రత్న, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌, ధర్మవరం ఆర్డీఓ మహేష్‌, డీపీఓ సమత, భూగర్భ జల శాఖ డీడీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌ చేతన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement