
మండల సర్వేయర్‌పై పచ్చ దౌర్జన్యం
బత్తలపల్లి: అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ తమ మాటే వినాలనే ధోరణితో మండల సర్వేయర్‌పై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి తెరలేపారు. మాట వినకపోతే నానా దుర్భాషాలు ఆడుతూ రెచ్చిపోయారు. గురువారం బత్తలపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో, తహసీల్దార్ స్వర్ణలత సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. మాల్యవంతం పంచాయతీ పరిధిలోని ఎం.చెర్లోపల్లికి చెందిన టీడీపీ సానుభూతిపరులు రేవతి, గంగాదేవి, లక్ష్మీదేవి, నారాయణమ్మ, ఓబులేసు, నిర్మలమ్మకు 2002లో సర్వే నంబర్ 31–6 లో డీ పట్టాలను అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే ఆ భూములు సాగు చేయకుండా బీడుగా ఉంచుకోవడంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు చిన్న వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి గత ఆరేళ్లుగా చీనీ చెట్లు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమిలో సాగులో ఉన్న తమ పేరున పట్టాలు ఇవ్వాలంటూ చిన్న వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి ఇటీవల స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వేయర్ జోసఫ్ ఆ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైతులకు డి.పట్టా ఉందని, పట్టాదారు పాసుపుస్తకం ఉందని అయితే భూమి సాగులో లేరని, పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి ఇరువురి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోయినా వారు ఆ భూమిలో సాగులో ఉన్నట్లు నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నిలదీశారు. ఆ భూమిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, ఈలోపు మీరేందుకు సర్వే చేశారంటూ మండిపడ్డారు. తహసీల్దార్ ఎంత సర్ది చెప్పబోయినా వినలేదు. పరిస్థితి అదుపు తప్పి దాడికి తెగబడే అవకాశముండడంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులు, రైతులకు సర్దిచెప్పారు. అనంతరం టీడీపీ నేతలు, మండల సర్వేయర్ వాదనలను తహసీల్దార్ స్వర్ణలత విని సమస్య పరిష్కారానికి శుక్రవారం గ్రామానికి రానున్నట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా న్యాయం జరిగేలా చూస్తామన్నారు.