
దాహం తీరదు
నీరు పారదు..
పుట్టపర్తి వాసుల తాగునీటి ఆశలపై కూటమి సర్కార్ నీళ్లు చల్లింది. పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ రూ.100 కోట్లతో మొదలుపెట్టిన తాగునీటి పథకానికి పూర్తిగా మంగళం పాడింది. ఇప్పటికే రూ.18 కోట్ల పనులు పూర్తయిన పథకాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.154 కోట్లకు పెంచి
మళ్లీ టెండర్లు పిలిచింది. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో..
తమ దాహార్తి ఎప్పుడు తీరుతుందోనని పుట్టపర్తి వాసులు ఎదురుచూస్తున్నారు.
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి నడయాడిన పుట్టపర్తిలో తాగునీటికి తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రం అయ్యాక శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. పట్టణ జనాభా పెరుగుతూ వస్తోంది. దీంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ సీపీ సర్కార్ పుట్టపర్తి తాగునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపేందుకు ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) నిధులు రూ.100 కోట్ల వ్యయంతో తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది.
బుక్కపట్నం చెరువు నుంచి నీరు..
పుట్టపర్తికి నీరందించే పథకానికి జగన్ సర్కార్ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. బుక్కపట్నం చెరువులో ఇన్‌టేక్ వెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా నీటిని ప్రశాంతి గ్రామంలో ఏర్పాటు చేసే ట్రీట్‌మెంట్ ప్లాంట్ వరకూ సరఫరా చేయాలి. అక్కడ శుద్ధిచేసిన నీటిని మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి, బ్రాహ్మణపల్లి, ప్రశాంతిగ్రామం, పెద్ద కమ్మవారిపల్లి, ఎనుములపల్లి, చిత్రావతి గుట్ట, ఎద్దులకొండ, కర్ణాటక నాగేపల్లి తదితర 8 చోట్ల నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపింగ్ చేయాలి. ఆయా ట్యాంకుల నుంచి ప్రతి ఇంటికీ సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
18 శాతం పనులు పూర్తి..
వీలైనంత త్వరగా పుట్టపర్తి వాసుల తాగునీటి కష్టాలు తీర్చాలని భావించిన జగన్ సర్కార్ తాగునీటి పథకం పనులను శరవేగంగా చేపట్టింది. సుమారు రూ.18 కోట్లతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులతో పాటు ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. మొత్తంగా 18 శాతం పనులు పూర్తయ్యాక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం...ఆ తర్వాత కూటమి సర్కార్ కొలువుదీరడంతో పుట్టపర్తికి నీరందించే పథకానికి గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రశాంతి గ్రామం సమీపంలో నిర్మిస్తున్న ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఫలితంగా కొన్ని పిల్లర్లకు, ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు వేసిన ఇనుప చువ్వలు తుప్పు పట్టాయి. ఇక నిర్మాణ పనులకు ఉపయోగించే సిమెంట్ బస్తాలు గడ్డకట్టి పాడైపోయాయి.
టెండర్లు రద్దు..
సుమారు 18 శాతం పనులు పూర్తయిన పథకానికి సంబంధించిన టెండర్లను సైతం కూటమి సర్కార్ రద్దు చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం మళ్లీ టెండర్లు పిలవడానికి రూ.154 కోట్లతో అంచనాలు వేయించింది. అలాగే గతంలో ‘మెగా’ కంపెనీ పనులు దక్కించుకోగా... కూటమి ప్రభుత్వం మాత్రం హైబ్రిడ్ యూనిట్ మోడల్ తరహాలో రాయలసీమలోని 8 జిల్లాల్లోని తాగునీటి పనులన్నీ కలిపి ఒకే టెండర్ పిలించేందుకు సిద్ధమైంది. దీనికి వరల్డ్ బ్యాంకు అనుమతి ఇవ్వడంతో 2029లోపు పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కానీ జిల్లా కేంద్రమైన పుట్టపర్తి శివారు ప్రాంతాల్లో విపరీతంగా నూతన గృహాలు వెలియడంతో పాటు జనాభా కూడా పెరగడంతో తాగునీటి ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా కూటమి సర్కార్ తాగునీటి పథకం పనులను 2029లోపు పూర్తి చేస్తామని చెబుతుండటంతో ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమకు తాగునీరివ్వాలని కోరుతున్నారు.
పుట్టపర్తికి తాగునీరందించే
పథకానికి గ్రహణం
ఏఐఐబీ ఫండ్స్ రూ.100 కోట్లతో పనులు ప్రారంభించిన జగన్ సర్కార్
ఇప్పటికే రూ.18 కోట్లతో పనులు
రాష్ట్రంలో కూటమి కొలువుదీరాక
ఆగిన ప్రాజెక్టు పనులు
పూర్తికాని ట్రీట్‌మెంట్ ప్లాంట్..
తుప్పు పడుతున్న ఇనుము
పాత వాటిని రద్దు చేసి
కొత్తగా టెండర్లు పిలిచిన సర్కార్
కొత్త రేట్లను సాకుగా చూపి ప్రాజెక్టు విలువ రూ.154 కోట్లకు పెంపు
కమిటీ నివేదిక తర్వాతే పనులు
పుట్టపర్తికి తాగునీరందించే పథకం పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నాటికి పనులు పూర్తి కాకపోవచ్చు. ప్రస్తుతం జరిగిన 18 శాతం పనుల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. కమిటీ సభ్యులు నాణ్యతను పరీక్షించి నివేదిక ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు.
– నరసింహమూర్తి, డీఈ, పబ్లిక్ హెల్త్