
దళిత బిడ్డకు న్యాయం చేయండి
అనంతపురం కార్పొరేషన్: మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు కోరారు. బుధవారం నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులు, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని తన్మయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ రెండు ఘటనలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఎక్స్‌గ్రేషియా అందించాలని కోరారు. తన్మయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేయాలన్నారు. అనంతరం శైలజ విలేకరులతో మాట్లాడారు. యువత, అమ్మాయిలపై సినిమాల ప్రభావం తీవ్రంగా ఉంటోందని అన్నారు. అనంతరం ఆమె సామూహిత అత్యాచారానికి గురై ప్రభుత్వ సర్వజనాస్పత్రి లేబర్ వార్డులో ఉన్న బాధిత బాలికను ఆమె పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, అంజలి, హజర, ఉష, రాధాయాదవ్, భారతి, లీలా, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు చిరంజీవి, నాగరాజు నాయక్, మణికంఠ, సంగమేష్ పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థిని తన్మయి
కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వినతి