
10 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 10 మండలాల్లో మోస్తరు నుంచి తుంపర వర్షం కురిసింది. అమరాపురం మండలంలో 6.4 మి.మీ, కొత్తచెరువు 2.2, గుడిబండ 2.2, సోమందేపల్లి 2.2, పెనుకొండ 2, రొద్దం 1.8, బత్తలపల్లి 1.4, పుట్టపర్తి 1.4, ధర్మవరం 1.2, ముదిగుబ్బ మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వెల్లడించారు.
సేవలతో పోలీస్ శాఖ
ప్రతిష్ట పెంచాలి
● ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్లకు
ఎస్పీ రత్న సూచన
పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించి ప్రజల్లో పోలీస్‌శాఖ ప్రతిష్ట పెంచాలని ఎస్పీ రత్న ప్రొబేషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం జిల్లాకు 15 మంది ప్రొబేషనరీ ఎస్‌ఐలను కేటాయించింది. దీంతో వీరు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రత్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నేరస్తులు, అనుమానితులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే విధంగా విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్‌ఐలు వలి, మహేష్, సోషల్ మీడియా ఎస్‌ఐ మునిపత్రాప్ పాల్గొన్నారు.
స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం..
కాలు కోల్పోయిన కార్మికుడు
హిందూపురం: మండల పరిధిలోని గోళ్లాపురం పారిశ్రామికవాడలోని బ్లూ గోల్డ్ స్టీల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు కుడికాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి కార్మికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్లూ గోల్డ్ స్టీల్స్ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనూప్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించ లేదు. సోమవారం రాత్రి విధుల్లోకి వెళ్లిన అనూప్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురికాగా, కుడికాలు తెగి పక్కన పడింది. విషయాన్ని గోప్యంగా ఉంచిన కంపెనీ యాజమాన్యం వెంటనే అతన్ని బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. ఈ ఘటనపై తూమకుంట పారిశ్రామికవాడ కార్మిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ... బ్లూ గోల్డ్ స్టీల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అనూస్ అంగవికలుడయ్యాడని, అతనికి మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అలాగే అతను పూర్తిగా కోలుకొనే వరకూ వేతనం ఇస్తూ, కార్మిక చట్టం ప్రకారం నష్ట పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

10 మండలాల్లో వర్షం