
నీటిపై పన్నుకు కూటమి కుట్ర
పెనుకొండ రూరల్: ‘‘ఏడాది పాలనలోనే ఎడాపెడా అప్పులు చేసిన కూటమి సర్కార్.. ప్రజలపై పన్నుల మీద పన్ను వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తాగునీటిపై ప్రభుత్వం లోన్లు తీసుకువచ్చింది. వాటిని తీర్చేందుకు వాటర్ మీటర్లు బిగించాలని డీపీఆర్‌లో పేర్కొంది. తాగునీటిపై కూడా ట్యాక్స్‌లను వేసే చరిత్ర గతంలో ఎన్నడు చూడలేదు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను సగం తాకట్టు పెట్టింది. త్వరలోనే రాష్ట్రాన్ని అమ్మేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తొలిఅడుగు అంటూ కూటమి నేతలు తమ ఏడాది పాలన గురించి చెప్పేందుకు జనం వస్తున్నారని, కానీ జనానికి మాత్రం అభివృద్ధి కంటే కూటమి సర్కార్ చేసిన లక్షా యాభై వేల కోట్ల అప్పే కనిపిస్తోందన్నారు. అందువల్లే ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మడం తప్ప మరోదారి లేదని తేల్చేశారన్నారు. ఎన్నికల వేళ అలివిగాని హామీలు గుప్పించిన కూటమి నాయకులు.. అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయలేమని బహిరంగానే చెబుతున్నారన్నారు. ఎన్నికల వేళ రెట్టింపు పథకాలు ఇస్తామన్న నాయకులు, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పథకాలను కూడా సంపూర్ణంగా ఇవ్వలేక పోతున్నారన్నారు. పథకాలు అమలుపై ప్రజల మధ్య చర్చ రాకుండా ఉండేందుకే, వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ... డైవర్షన్ పాలిటిక్స్‌కు కూటమి ప్రభుత్వం తెరలేపిందన్నారు.
పవన్ కల్యాణ్‌ఎక్కడున్నారో
రాష్ట్రంలో మహిళల పట్ల దాడులు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాటి గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఆయనకు తన సినిమా ప్రమోషన్‌పై ఉన్న శ్రద్ధ..మహిళల రక్షణపై లేదన్నారు. గతంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా వారిని కనిపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. శ్రీకాళహస్తిలో సొంత కార్యకర్తను చంపితే కూడా ఆయన మాట్లాడక పోవడం బాధాకరమన్నారు.