
ఏసీబీ వలలో దుర్గం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్
అనంతపురం/కళ్యాణదుర్గం:కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి ఏసీబీ వలకు చిక్కారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని రామ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా ఉన్న నారాయణస్వామికి ఇటీవల ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించారు. కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల గ్రామానికి చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి నాగేంద్రనాయక్ కళ్యాణదుర్గంలో 1.5 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, ల్యాండ్ కన్వర్షన్ నిమిత్తం కార్యా ల యానికి వెళ్లగా రూ.7 లక్షలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.5 లక్షలకు ఒప్పుకున్నారుు. ఈ క్రమంలోనే నాగేంద్రనాయక్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. గురువారం రాత్రి డబ్బు ముట్టజెప్పేందుకు అనంత పురం రామ్‌నగర్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు రావాలని కోరాడు. నారాయణస్వామి డబ్బు తీసుకుంటుండగా, అప్పటికే కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంటేషన్ పరిశీలనకు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
చర్చనీయాంశం..
కళ్యాణదుర్గం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నారాయణ స్వామిని అటు కార్యాలయంలోనూ, ఇటు అధికార టీడీపీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అధికార టీడీపీలో కేవలం ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉంటున్నారన్న కారణంతో పలుమార్లు నారాయణస్వామిపై టీడీపీలోని మరో వర్గం జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసింది. ఇటీవల రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ–స్టాంప్ కుంభకోణంలో సైతం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి పాత్ర ఉన్నట్లు టీడీపీలోని ఓ వర్గం ఆరోపించింది. కంబదూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల తహసీల్దార్ల సంతకాల ఫోర్జరీ, భూ బదలాయింపుపై కూడా ఆరోపణలు వినిపించాయి. అలాగే, జిల్లాకు చెందిన కీలక మంత్రి భూమి విషయంలో నారాయణస్వామిపై కన్నెర్ర చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ వలలో పడడం చర్చనీయాంశమైంది.