
పనులపై పూర్తి సమాచారమివ్వండి
ప్రశాంతి నిలయం: గ్రామీణాభివృద్ధి పనులపై జాతీయ కేంద్ర బృందం ఎనిమిది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుందని, ఈ నేపథ్యంలో ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై పూర్తి సమాచారం కేంద్ర బృందానికి సమర్పించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి పథకం అమలుపై జాతీయ కేంద్ర బృందం సభ్యులు దయాకర్‌రెడ్డి, చూడామణి రెడ్డితో కలసి కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ అమరాపురం, గాండ్లపెంట, రామగిరి మూడు మండలాల్లో 8 గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు. వివిధ అంశాలపై ఈ బృందం దృష్టిసారించనుందన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రభుత్వ సేవలు అందేలా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 పథకం విజయవంతం అయ్యేలా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో పీ4, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శి, గ్రామ సభలు, ప్రభుత్వ పథకాలు సేవల ప్రజా స్పందన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడారు. పీ4పై జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ సేవలు సంతృప్తికరస్థాయిలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.