
హామీలపై కూటమిని నిలదీయండి
పరిగి: ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా సుపరిపాలన పేరుతో కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని నిలదీయండి’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. పరిగి మండలంలో గురువారం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా విట్టాపల్లి, పీ నరసాపురం, కొడిగెనహళ్లి మేజర్ పంచాయతీ బిందూనగర్, మోదా గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని, కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు.
యువతకు ఉపాధి ఎక్కడా?
ఈ ప్రాంతంలోని ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు మూత పడిందన్నారు. అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధిని కల్పిస్తామని నమ్మబలికించి ఇలా ఉన్న ఉద్యోగాలను ఊడగొడట్టేందుకే మీకు అవకాశమిచ్చారా అంటూ మంత్రి సవితపై ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉంటూ కనీసం బీసీలకు ఏమాత్రం న్యాయం చేశారో మంత్రి సవిత ఆత్మ విమర్శ చేసుకోవాన్నారు.
దళిత బాలికకు ఏం న్యాయం చేశారు?
రాష్ట్రాన్ని కుదిపేసిన ఏడు గుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత స్పందించకపోవడం దారుణమన్నారు. ఇటీవల ఆమె మడకశిరలో పర్యటించినప్పటికీ రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేవలం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడానికి మాత్రమే మంత్రులు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బెదిరింపులకు భయపడే వారెవరూ వైఎస్సార్‌సీపీలో లేరని.. తప్పు చేసింటే నేడు ప్రజలతో ఇలా మమేకమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. నిత్యం అబద్దాలతో కూటమి నాయకుల చేస్తున్న వాగ్ధానాలను నమ్మవద్దని హితవుపలికారు. కార్యక్రమాల్లో మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సుపరిపాలన పేరుతో టీడీపీ దుష్ప్రచారం
బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత
ప్రగల్బాలకే పరిమితం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు
ఉషశ్రీచరణ్