
ఏడు గుర్రాలపల్లి బాధితురాలికి న్యాయం చేస్తాం
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లి బాలికకు న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి సాయి ఆరామంలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏడు గుర్రాలపల్లి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాలిక కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగా అండగా ఉంటామన్నారు. బాలిక ఎంత వరకూ చదివితే అంత వరకూ చదివిస్తామన్నారు. పోక్సో చట్టం కింద వచ్చే పరిహారం అందజేస్తామన్నారు. అఘాయిత్యానికి పాల్పడిన 17 మంది నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. ఆడ బిడ్డలు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా, సమస్యలు పరిష్కరించుకోవాలన్నా విద్య చాలా ముఖ్యమని పేర్కొన్నారు. చట్టాలపై మహిళందరికీ అవగాహన అవసరమని చెప్పారు. తమ దృష్టికి వచ్చే కొన్ని కేసులను సుమోటాగా తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 500 శక్తి టీంలు ఏర్పాటు చేశామని , 900 హాట్‌స్పాట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశం ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.