
నిడిగల్లు వాసికి జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు
తాడిమర్రి: మండలంలోని నిడిగల్లు గ్రామానికి చెందిన బీదాల పెద్దన్నకు జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు దక్కింది. బళ్లారి సమీపంలోని ఆదానీ సిమెంట్స్‌లో దక్షిణ భారతదేశ జోనల్ హెడ్‌గా పనిచేస్తున్న ఆయన, డాక్టర్ రమేష్ చంద్, నీతి అయోగ్ సభ్యులతో కలసి కంపెనీ సమీపంలోని గ్రామాల్లో 29 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, 65 వేల మందికి పైగా రైతుల జీవనోపాధుల మెరుగు పరచడంలో చేసిన కృషికి గాను అవార్డు దక్కింది. బుధవారం ఢిల్లీలో జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) నిర్వహించిన కృషి విక్రమ్ – 2025 జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా నిడిగల్లు వాసులు హర్షం వ్యక్తం చేశారు.
జేఏసీ కన్వీనర్ సాకే హరి అరెస్ట్
పుట్టపర్తి టౌన్: ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్న ఆర్డీటీ పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ సాకే హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం కొత్తచెరువు సీఎం పర్యటనలో ఆర్డీటీని కాపాడాలని జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న సీఐలు రెడ్డెప్ప, జయపాల్‌రెడ్డి తదితరులు సాకే హరిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను సీఎంకు తెలియజేయడానికి చెప్పుకొనేందుకు వెళ్తున్న జేఏసీ నాయకులు, సభ్యలను పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
రైల్వే ఆస్పత్రిలో
సమస్యలు పరిష్కరించాలి
గుంతకల్లు: రైల్వే ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కోరారు. గురువారం గుంతకల్లు రైల్వే ఆస్పత్రికి విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్ మెడికల్ డైరెక్టర్ నిర్మాల రాజరాంకు మెడికల్ బ్రాంచ్ సెక్రటరీ రమేష్‌తో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఆస్పత్రిలో ముఖ్యమైన సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్లతోపాటు 7 నర్సింగ్ స్టాఫ్‌లు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఫార్మిసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, ఈసీజీ టెక్నిషియన్ పోస్ట్‌లు భర్తీకి నోచుకోలేదన్నారు. ఇక్కడి నుంచి అనంతపురం, కర్నూలులోని కార్పొరేట్ ఆస్పత్రులకు రైల్వే ఉద్యోగులను మెరుగైన వైద్యం కోసం రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. గుంతకల్లు పట్టణానికి సమీపంలో ఉన్న బళ్లారి సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రికి రెఫరల్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతకముందు సీఎండీ నిర్మాల రాజరాం రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ విభాగాన్ని పరిశీలించి రోగులకు అందతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

నిడిగల్లు వాసికి జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ అవార్డు