
ఘర్షణ కేసులో 21 మంది అరెస్ట్
రాయదుర్గం: వివాహేతర సంబంధ కారణంగా ఆస్తి విధ్వంసాలకు పాల్పడిన 21 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లికి చెందిన అనంతరాజు కొంత కాలంగా అదే మండలం మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంగా వివాదం తలెత్తి సోమవారం రాత్రి అనంతరాజుపై దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అనంతరాజు, ఆయన బంధువులు మైలాపురం చేరుకుని లోకేష్, విజయ్ ఇళ్లల్లోకి చొరబడి తలుపులు, టీవీ, రెండు ద్విచక్రవాహనాలు, కారు ధ్వంసం చేయడంతో పాటు పది ట్రాక్టర్ల ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఇరు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆస్తి నష్టానికి కారకులైన 21 మంది యువకులను గురువారం అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, ఇదే కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతరాజును డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అనంతరాజుపై దాడికి కారకులైన మైలాపురం గ్రామానికి చెందిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నబీరసూల్, బొమ్మనహాళ్ పోలీసులు పాల్గొన్నారు.