
రెక్కీ నిర్వహించి.. గొలుసు అపహరణ!
రాప్తాడు రూరల్: రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును యువకుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన రమణయ్య, పద్మావతి దంపతులు కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని నందమూరినగర్‌లో స్థిరపడ్డారు. సొంతూరిలో ఉన్న భూముల్లో భర్త వ్యవసాయం చేస్తున్నాడు. పద్మావతికి గుండె శస్త్రచికిత్స జరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లలేక ఇంటికి సమీపంలోనే కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కనే ఓ బంకు ఏర్పాటు చేసుకుని కూల్‌డ్రింక్స్, స్నాక్స్ విక్రయిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఓ యువకుడు వచ్చి బంక్ వద్ద దాదాపు గంట పాటు కూర్చొని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే యువకుడు మరోమారు వచ్చాడు. సిగరెట్ తీసుకుని తాగాడు. 2.30 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న అనంతరం ‘పెద్దమ్మా...తాగేందుకు కొన్ని నీళ్లు ఇవ్వు’ అని అడిగాడు. దీంతో పద్మావతి ఫ్రిజ్ తెరుస్తుండగా ఒక్క ఉదుటన వెనుక నుంచి అరవకుండా నోటిని గట్టిగా అదిమపెట్టి మెడలో ఉన్న బంగారు చైనును లాక్కొని, ఆమెను గిరాటేసి వెళ్లిపోయాడు. ఈ హఠత్పరిణామంతో కాసేపటి వరకూ ఆమె కోలుకోలేక పోయింది. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన యువకుడు ఎలాంటి బెదురు లేకుండా నింపాదిగా నడుచుకుంటూ వెళ్లడం విశేషం. ఘటనపై బాధితురాలు అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలసీఉలు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమరాలను పరిశీలిస్తున్నారు.