
మహారాష్ట్ర భక్తుల పర్తి యాత్ర
ధర్మవరం అర్బన్: పర్తి యాత్రలో భాగంగా ధర్మవరం రైల్వే స్టేషన్‌కు గురువారం చేరుకున్న మహారాష్ట్ర వాసులు పాదయాత్రగా పుట్టపర్తికి తరలివెళ్లారు. దాదాపు 500 మందికి పైగా భక్తులు వారి సంప్రదాయ రీతిలో భజనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ వెళుతుండగా పట్టణ ప్రజలు సాదరస్వాగతం పలికారు.
ఇద్దరిపై కేసు నమోదు
కదిరి అర్బన్: యువకుడిపై రాళ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను సీఐ నారాయణరెడ్డి గురువారం వెల్లడించారు. కదిరిలోని నిజాంవలీ కాలనీకి చెందిన కేదార్ మహేష్‌కుమార్‌పై అదే కాలనీకి చెందిన రాకేష్, నగేష్ రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. స్నేహితులైన ఈ ముగ్గురి మధ్య చిన్నపాటి గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్‌కుమార్‌పై వారు దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాకేష్, నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జూదరుల అరెస్ట్
పరిగి: మండలంలోని మోదా పంచాయతీ పరిధిలో పేకాట ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలసి ఎస్‌ఐ రంగడు యాదవ్ గురువారం మోదా పంచాయతీ పరిధిలోని బందార్లపల్లి శివారున తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించగానే పేకాటరాయులు పారిపోయారు. పోలీసులు వెంటాడి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.70,500 నగదు, 19 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. జూదరులపై కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిబంధనల ఉల్లంఘనులపై కఠిన చర్యలు
పుట్టపర్తి టౌన్: ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి మద్యం షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రోహిబిషన్, ఎకై ్సజ్ అధికారి గోవింద నాయక్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మద్యం దకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలన్నారు. బార్లలలో రాత్రి 11 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. ప్రతి మద్యం షాపులోనూ 21 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలన్నారు. ఒకరికి 3 కంటే ఎక్కువ మద్యం సీసాలు విక్రయించరాదన్నారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు చేయరాదన్నారు. .సుంకం చెల్లించని మద్యం, కల్తీ మద్యం విక్రయించిన దుకాణ యజమానులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
డీఎస్పీ పదోన్నతుల
సీనియార్టీ జాబితా విడుదల
అనంతపురం: డీఎస్పీ పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక (అడహాక్ ) సీనియార్టీ జాబితాను అధికారులు విడుదల చేశారు. 2024–25 ప్యానల్‌లో సీనియార్టీ జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీఐలు ఉన్నారు. వీరిలో కె.దేవానంద్ (అనంతపురం), ఎం.ఆదినారాయణ (పీటీసీ అనంతపురం), బి.మోహన్ ( శ్రీసత్యసాయి), కె.సాయినాథ్ (అనంతపురం), ఎస్వీ భాస్కర్‌గౌడ్ (అనంతపురం), కె.రాఘవన్ (శ్రీసత్యసాయి), పి.సత్యబాబు (అనంతపురం), జి.బాలసుబ్రహ్మణ్యం రెడ్డి (శ్రీసత్యసాయి) ఉన్నారు.
కలుషిత నీరు తాగి
16 జీవాల మృతి
బెళుగుప్ప: కలుషిత నీరు తాగి 16 జీవాలు మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలం కోనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు తన మొక్కజొన్న పంటకు యూరియా కలిపిన నీటిని డ్రిప్ ద్వారా అందించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గొర్రెల మంద అక్కడకు చేరుకుంది. దాహంతో ఉన్న గొర్రెలు, మేకలు అప్పటికే తొట్టెలో ఉన్న యూరియా కలిపిన నీటిని తాగాయి. కాసేపటి తర్వాత 10 గొర్రెలు, 5 మేకలు, ఓ పొట్టేలు మృత్యువాత పడడంతో కాపరులు తిప్పయ్య, మహేష్, వన్నూరుస్వామి, రామాంజనేయులు, అంజనప్ప, లింగన్న ఆవేదన వ్యక్తం చేశారు.