
ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలి
ప్రశాంతి నిలయం: ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేయాలని, సంపూర్ణ ఆరోగ్యంతోనే చక్కగా జీవించవచ్చని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ శాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి గ్రస్తులకు పౌష్టికాహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కిలో కందిపప్పు, కిలో రాగిపిండి, కిలో గోధుమపిండి, కిలో శనగపిండి, కిలో వేరుశనగ, నూనె, 30 కోడిగుడ్లు, 250 గ్రాముల చిక్కీ బర్ఫీలు, కిలో శనగలు, 8 రకాల పౌష్టికాహార పదార్థాలతో కూడి కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,172 మంది టీబీ రోగులకు చికిత్స పొందుతున్నారన్నారు. వారికి జిల్లాలో గల రెండు కంపెనీల సహకారంతో పౌష్టికాహారం ఆరు నెలలకు ఒకసారి చొప్పున అందించనున్నట్లు చెఆప్పరు. పౌష్టికాహారంతో పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో దాతలు సింగ్వూ కంపెనీ ప్రతినిధులు ఆదిత్య, డీఎస్‌ఓ వంశీకృష్ణ, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మధుసూదన్, డీఎస్‌ఏటీఓ డాక్టర్ ఎస్.ఎ.సునీల్ కుమార్, ఎంఓడీటీసీ డాక్టర్ గాయత్రి, టీబీ సిబ్బంది పాల్గొన్నారు.