కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు | - | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు

Jun 30 2025 7:24 AM | Updated on Jun 30 2025 7:24 AM

కొలువ

కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు

బత్తలపల్లి: మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బత్తలపల్లిలో ఖాశీంస్వామి పీరును కొలువుదీర్చారు. శనివారం రాత్రి ముజావర్లు మహబూబ్‌బాషా, ఖాశీంపీరా, ఫక్రుద్దీన్‌, ఖాశీంవలి ఖాశీంస్వామి చావిడిలో ఫాతెహా చేశారు. అర్ధరాత్రి పీరును కొలువుదీర్చారు. ఆదివారం నిత్యపూజ నివేదన నిర్వహించారు. మండలంలోని గంటాపురం, పోట్లమర్రి, వేల్పుమడుగు, ముష్టూరు, మాల్యవంతం, రాఘవంపల్లి, యర్రాయపల్లి, లింగారెడ్డిపల్లి, అనంతసాగరం, వెంకటగారిపల్లి తదితర గ్రామాల్లో మొహర్రం వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌, ఎస్‌ఐ సోమశేఖర్‌ తెలిపారు. మొహర్రం వేడుకలు నిర్వహించే వారు పోలీస్‌స్టేషన్‌లో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

తప్పుడు ‘స్పౌజ్‌’ ఆప్షన్‌తో బదిలీలు

ధర్మవరం అర్బన్‌: సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది తప్పుడు ‘స్పౌజ్‌’ ఆప్షన్‌తో బదిలీలు చేయించుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ప్రధాన కార్యదర్శి పులిబండ్ల నరసింహారావు, గౌరవాధ్యక్షుడు రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వారు ఆదివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలో శనివారం జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో స్పౌజ్‌ ఆప్షన్‌ దుర్వినియోగం చేయడంతో చాలామంది అర్హులు నష్టపోయారని తెలిపారు. ఆర్‌డీఎంఏ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులకు న్యాయం చేకూర్చాలని కోరారు.

ఏ క్షణంలోనైనా

తుంగభద్ర తుళ్లింత

డ్యాంలో ఇప్పటికే 68 టీఎంసీల నీరు నిల్వ

65,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయం నుంచి ఏ క్షణంలోనైనా నదికి నీరు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తి డ్యాంలో నీటి మట్టం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 65,182 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. డ్యాంలో గరిష్ట నీటి నిల్వ 68 టీఎంసీలకు పైగా చేరింది. డ్యాం క్రస్ట్‌ గేట్లు బలహీనంగా ఉన్న నేపథ్యంలో కేవలం 80 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని ఇటీవల అధికారులు తీర్మానించారు. ఈ నేపథ్యంలో ఆ మేరకు నీరు చేరితే ఏ క్షణంలోనైనా దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నదీతీర, లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.

చిన్నారిని క్షేమంగా

తీసుకొచ్చిన పోలీసులు

కదిరి అర్బన్‌: కేరళలో ఓ కుటుంబం వద్ద పెరుగుతున్న చిన్నారిని ప్రత్యేక పోలీసు బృందం ఆదివారం క్షేమంగా కదిరికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్‌ అప్‌గ్రేడ్‌ పోలీస్టేషన్‌లో డీఎస్పీ శివనారాయణస్వామి మీడియాకు వెల్లడించారు. మరువతండాకు చెందిన రవీంద్రనాయక్‌, శ్రీవాణి దంపతులు మూడేళ్ల కుమార్తెను కేరళలో ఎందుకు వదిలేసి వచ్చారంటూ వారి బంధువు రామచంద్రనాయక్‌ ఇటీవల గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. డబ్బుల కోసం కుమార్తెను అమ్మేశారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేశారు. సంతానం లేని దంపతులకు పెంచుకునేందుకు తమ కూతురును ఇచ్చామని రవీంద్రనాయక్‌ దంపతులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కేరళకు ప్రత్యేక పోలీసు బృందం వెళ్లి అక్కడ రాజేష్‌, స్వాతి దంపతుల వద్ద ఉన్న బాలికను తీసుకుని కదిరికి వచ్చారు. సోమవారం సీడబ్ల్యూసీ ముందు చిన్నారిని హాజరుపరుస్తామని, చిన్నారిని విక్రయించారా.. నిజంగా పెంచుకునేందుకు ఇచ్చారా.. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయాలు దర్యాప్తులో తేలుస్తామని డీఎస్పీ చెప్పారు.

కొలువుదీరిన  ఖాశీంస్వామి పీరు 1
1/2

కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు

కొలువుదీరిన  ఖాశీంస్వామి పీరు 2
2/2

కొలువుదీరిన ఖాశీంస్వామి పీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement