
గందరగోళంగా సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లోని సర్వే, భూరికార్డుల శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన గ్రామ సర్వేయర్ల బదిలీల కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. అధికారులు విడుదల చేసిన సీనియార్టీ జాబితాపై గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర నాయకులు అడ్డుచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాయినింగ్ డేట్ ఆధారంగా సీనియారిటీ జాబితా ఎలా ఇస్తారంటూ సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్‌తో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్‌నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇతర శాఖలు, ఇతర జిల్లాల్లో మాదిరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ర్యాంక్ ఆధారంగా సీనియార్టీ జాబితా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదంటే కౌన్సెలింగ్ బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పరిస్థితిని డీఆర్‌ఓ మలోల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన సర్వే శాఖ కార్యాలయానికి చేరుకుని సీనియారిటీ జాబితాపై అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ఏడీలు రూప్లానాయక్, విజయశాంతిబాయి, సూపరింటెండెంట్ అయూబ్‌తో సమీక్షించారు. జాబితాకు సంబంధించి మార్గదర్శకాలు, నిబంధనలను పరిశీలించారు. అనంతరం ఆయన సూచన మేరకు ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ తతంగం కారణంగా ఉదయం 9 గంటలకు మొదలవ్వాల్సిన బదిలీల కౌన్సెలింగ్ ఆరు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.
624 మందికి కౌన్సెలింగ్
ఉమ్మడి జిల్లాలో 828 మంది గ్రామ సర్వేయర్లు ఉన్నారు. వీరిలో అధికారిక నివేదిక ప్రకారం ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు 624 మంది ఉన్నారు. తొలుత మెడికల్ గ్రౌండ్స్, తరువాత స్పౌజ్ కింద దరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మిగిలిన వారికి చేపట్టారు.
సీనియార్టీ జాబితాపై తీవ్ర అభ్యంతరం
ఆరు గంటలు ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభం