
కారు దగ్ధం.. ప్రయాణికులు క్షేమం
నల్లమాడ: ప్రయాణిస్తున్న కారులో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందకు దిగిన వెంటనే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. కదిరి ఫైర్ ఆఫీసర్ సుబహాన్ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీ సి.రెడ్డివారిపల్లికి చెందిన వెంకటశివారెడ్డి అనంతపురంలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. బంధువులకు చెందిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం భార్య అనిత (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు), కుటుంబ సభ్యులు కేశవరెడ్డి, వసుంధరతో కలిసి ఏపీ39ఎల్‌ఎం 4541 నంబరు గల కారులో స్వగ్రామం వచ్చారు. ఆ రాత్రికి అక్కడే ఉండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెంకటశివారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం బయల్దేరారు. అలా సి.రెడ్డివారిపల్లి నుంచి కిలోమీటరు దూరం వెళ్లగానే కారు బానెట్‌లోంచి మంటలు వచ్చి దట్టమైన పొగలు రావడంతో వెంటనే అందులోని వారంతా కిందకు దిగి దూరంగా వెళ్లారు. కొద్దిసేపటికే కారు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమైంది. సమాచారం అందుకున్న కదిరి ఫైర్ ఆఫీసర్ సుబహాన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు కారు యజమాని వెంకటశివారెడ్డి తెలిపారు.