
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
పుట్టపర్తి టౌన్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు సర్వీసులు, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ప్లాట్‌ఫారం, మౌలిక వసతుల కల్పన తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరుగుదొడ్ల స్థితగతులు, హోటళ్లు, సమాచార కేంద్రం, రిజర్వేషన్ కౌంటర్ల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు అందిస్తున్న సేవలు గురించి ప్రయాణికులనే అడిగి తెలుసుకున్నారు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి డిజిటల్ పేమెంట్ ద్వారా టికెట్ కొనుగోలును కలెక్టర్ స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఆర్టీసీ బస్టాండ్‌ను స్వచ్ఛతకు చిరునామాగా మార్చాలన్నారు. ఇందుకోసం మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించాలన్నారు. భద్రత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆర్టీసీ సముదాయంలోని హోటళ్లు దుకాణాల వద్ద చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బస్టాండ్ నుంచి సర్వీసులు బయలుదేరు వేళల వివరాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీపీటీఓ మధుసూదన్, డీఎం ఇనయతుల్లా, ఏఓ ఉషారాణి, అసిస్టెంట్ మేనేజర్ హరితతో పాటు సిబ్బంది ఉన్నారు.
యోగాపై అవగాహన పెంపొందించుకోవాలి
ప్రశాంతి నిలయం: ప్రతి ఒక్కరూ వయసుతో పని లేకుండా యోగాసనాలపై అవగాహన పెంపొందించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ ప్రతి మనిషి తమ దైనందిన జీవితంలో యోగాకు అత్యధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా డివిజన్ స్థాయిలో జరిగే కార్యక్రమాలకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకొని ఇంటింటికీ వెళ్లి యోగాపై అవగాహన కల్పించాలన్నారు. యోగా డే సందర్భంగా జూన్ 21న జిల్లాలో యోగా కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పుట్టపర్తిలో ఆ నెల 28న, కదిరిలో జూన్ 4 , ధర్మవరంలో జూన్ 10, పెనుకొండలో జూన్ 17న యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఆర్టీసీ అధికారులకు
కలెక్టర్ చేతన్ ఆదేశం
పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన